Tirumala Update: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు వచ్చే భక్తులకై టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి ఆలయంలో రేపటి నుండి అనగా 17వ తేదీ నుండి సుప్రభాతం సేవను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇవాళ ఉ 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కాగా, రేపటి నుండి తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు, తులసీ దళాలకు బదులుగా.. బిల్వ పత్రాలతో శ్రీవారికి సహస్ర నామార్చన, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజూ స్వామివారికి అలంకరణ, విశేష నైవేద్యాలుగా బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలు నివేదన, భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
ఇక,
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 66,160 మంది భక్తులు దర్శించుకోగా.. 22,724 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.47 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వ దర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.