Tirupati : తిరుమల శ్రీవారిని క్షణ కాలం దర్శించుకుంటే చాలు. జన్మ ధన్యం అనుకుంటారు భక్తులు. కొండపైకి కాలినడకన వెళ్లడం మరింత పుణ్యంగా భావిస్తారు. అయితే, స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తుల కష్టాలు అంతాఇంతా కాదు. భక్తులు. నడక మార్గంలో వెళ్లే భక్తులకు గతంలో టైం స్లాట్ టోకెన్లు ఇచ్చేవారు. చిరుత పులి దాడి ఘటన తర్వాత అలిపిరి మార్గంలో భక్తులకు టైం స్లాట్ టోకెన్స్ ఆపివేశారు. కేవలం శ్రీవారి మొట్టు మార్గంలో మాత్రమే రోజుకు 3 నుంచి 5 వేల టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్‌కు ఉన్న డిమాండ్‌ను వాడుకొని.. భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు ఆటో నడిపే వాళ్లు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మొట్టు వరకు ఎక్కడికక్కడ దోచుకోవడమే. ఆటోవాలాల మాఫియాపై బిగ్ టీవీ పరిశీలన చేయగా కోట్ల రూపాయల దందా బయటపడింది.
ఆటోవాలాల వెనుకున్నది ఎవరు?
తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం, అక్కడ నుంచి L & T చెక్ పోస్టు వరకు ఓ చార్జీ.. అక్కడి నుంచి శ్రీవారి మొట్టు వరకు పూర్తి స్థాయిలో దోపిడి జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి అంచెలంచెలుగా వాహనాలు వదులుతారు. అయితే ఆ వాహనాలలో ఆటోలు ముందుంటాయి. వ్యక్తిగత వాహనాలు, ప్రజా రవాణాకు చెందిన వాహనాలు ముందుకు రాకుండా ఆటోవారు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. L&T చెక్ పోస్టు నుంచి ద్విచక్ర వాహనదారులు దందా చేస్తుంటారు. వీరు చెక్ పోస్ట్ వద్ద నుంచి 3 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 200 నుంచి 500 వరకు వసూలు చేస్తుంటారు. వ్యక్తిగత వాహనాలలో వచ్చినవారు సుదూర ప్రాంతాలలో తమ వాహనాలను పార్కింగ్ చేసి ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఈ దందాలో భాగస్వాములు ఎవరు? పోలీసులా? TTD సెక్యూరిటీ సిబ్బందా? లేక RTO సిబ్బందా? అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్కడికి వెళ్లాలంటే ఆటోలేనా?
ఒక్క ఆటోలో 10 మందికి తక్కువ కాకుండా.. 15 నుంచి 18 మంది వరకు తరలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిన ప్రయాణీకులను తరలిస్తున్న ఇలాంటివారిపై చర్యలు ఎందుకు ఉండటం లేదు? ట్రాన్స్‌పోర్ట్ దోపిడీ జరుగుతోందని భక్తులు మొత్తుకున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తుండటంలో కారణాలేంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శ్రీవారి మొట్టు వద్ద ఉన్న టైం స్లాట్ దర్శనం టోకెన్ దగ్గరకు వెళ్లడానికి భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచి కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆటోలు మాత్రమే అందుబాటులో ఉండేలా చేసి.. దొరికినంత దోచేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Also Read : తిరుమలలో అంతా కూల్ కూల్.. ఐడియా అదుర్స్
కొండ కిందే భక్తుల నిలువు దోపిడీ
తిరుపతి శ్రీనివాస మంగాపురం వరకు చేరుకోవడానికి అరగంట పడితే అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి చేరుకోవడానికి 5 గంటలు పడుతోంది. దీనికి భక్తులు చెల్లిస్తున్న చార్జీలు కూడా 200 నుంచి 500 వరకు ఉంటోందని వాపోతున్నారు. స్థానికంగా ఆటో మాఫియాతో పాటు.. తాజాగా ద్విచక్ర వాహనదారులు రెచ్చిపోయి ఈ దందా చేస్తున్నారు. పాలకులు ఎవరైనా సరే.. వీరి దోపిడీ మాత్రం ఆగడం లేదు. దీనిపై TTD, పోలీసు, RTO అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.