Tirupati SP on Jagan: నాది కూడా రాయలసీమనే.. అటువంటి కామెంట్స్ ని నేనసలు పట్టించుకోను. నా డ్యూటీ నాది. ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయను. ఈ మాటలన్నది ఎవరో కాదు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఎవరి కామెంట్స్ ను ఉద్ధేశించో తెలుసా.. సాక్షాత్తు మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై.
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల సోషల్ మీడియా వేదికగా మహిళలను ట్రోలింగ్ చేస్తున్న బ్యాచ్ పై కేసులు నమోదు చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలన సమయంలో మితిమీరి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన ఒక్కొక్కరిని ఇటీవల వదిలిపెట్టకుండా, పోలీసులు అరెస్టుల పర్వం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అరెస్టులపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య విమర్శలు కూడా జోరుగా సాగుతున్నాయి.
సాక్షాత్తు సీఎం చంద్రబాబు కూడా ఈ ట్రోలింగ్స్ పై సీరియస్ అయ్యారు. మహిళల వ్యక్తిగత హనాన్ని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా, చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు మాజీ సీఎం జగన్ కూడా కక్షపూరితంగా ప్రభుత్వం పోలీసుల ద్వారా, కేసులను నమోదు చేస్తుందన్నారు. ఇలా కేసులు నమోదు చేస్తే టీడీపీ సోషల్ మీడియాపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఎప్పటికీ ఈ ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు.
అంతటితో ఆగక తిరుపతి జిల్లా ఎస్పీపై సీరియస్ కామెంట్స్ చేశారు జగన్. తెలంగాణ నుండి అదే పనిగా డిప్యూటేషన్ పై తీసుకువచ్చి తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బరాయుడును నియమించారని, మళ్లీ డిప్యూటేషన్ పై వెళ్తానన్న ధైర్యంతో ఎస్పీ సుబ్బరాయుడు అక్రమ కేసులు నమోదు చేస్తున్నట్లు జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి తమ కార్యకర్తలను ఇబ్బందులు గురి చేసే పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వెనక్కి పిలిపించి మరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజాగా ఈ కామెంట్స్ పై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. తాను కేవలం తన విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నానని, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఆశయంతో పని చేస్తున్నట్లు తెలిపారు. తనది అనంతపురం జిల్లాగా పేర్కొన్న ఎస్పీ, తాను కూడా రాయలసీమ వాసినేనంటూ, చట్టపరంగా మాత్రమే తాను విధులు నిర్వహిస్తున్నానన్నారు. రాజకీయ విమర్శలను తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎస్పీ అభిప్రాయపడ్డారు.