Tirupati Stampede: గత కొద్ది రోజుల క్రితం.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశం ద్వారా.. మృత కుటుంబాలకు పాతిక లక్షల చెక్కులు పంచడం, మృతుల కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వడం, బాధిత కుటుంబాల పిల్లల చదువు బాధ్యత టీటీడీ తీసుకునే పలు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది.
వాడి వేడిగా సాగిన ఈ సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సభ్యులు. విజిలెన్స్ విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలుంటాయని అన్నారు టీటీడీ బోర్డు చైర్మన్. టీటీడీ అధికారులు పాలకమండలి సభ్యులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్న మాట వాస్తవమేననీ.. త్వరలో ఆయా జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిదుల నేతృతంలో మృతుల కుటుంబాలకి చెక్కులు పంపిణీ చేస్తానీ అన్నారు పాలక మండలి చైర్మన్.
ఈ ఘటన జరగకుండా ఉండాల్సిందనీ.. ఒకరిద్దరు చేసిన పొరబాటు వల్ల జరిగిన దురదృష్టకరమైన ఘటనగా చెప్పారు చైర్మన్. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామనీ. ఎంత చేసినా బాధిత కుటుంబాలకు జరిగిన నష్టం తిరిగి పూడ్చలేదనీ. ముఖ్యమంత్రి ఆదేశాలు పూర్తిగా పాటిస్తామనీ. ఇవన్నీ జరగడం ఒక ఎత్తు. వచ్చే రోజుల్లో మేము తీసుకోబోయే జాగ్రత్తలు మరొక ఎత్తనీ. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కావాలని జరిగిన ఘటనా? త్వరలో తేలనుందని.. బాధ్యులెవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదని అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
Also Read: ఏడు కొండలవాడా ఏంటీ ఘోరం.. తొక్కిసలాట ఘటనకు కారకులెవరు?
ఈ తరుణంలో.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులకు నష్టపరిపరిహారం అందించింది టీటీడీ పాలక మండలి. నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈరోజు స్విమ్స్ లో చికిత్స పొందుతున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున.. స్వల్పంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అందజేశారు.