TTD Chairman BR Naidu: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబ సభ్యులకు టీటీడీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. బుధవారం తిరుపతి లో జరిగిన తొక్కిసలాటపై టీటీడీ పాలకమండలి ప్రత్యేక సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ వివరించారు.
చైర్మన్ బీ.ఆర్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను పాలకమండలి చర్చించి ఆమోదం తెలిపినట్లు తెలిపారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ. 2 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మృతుల పిల్లలకు టీటీడీ తరఫున ఉచిత విద్యను అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు. అలాగే మృతుల కుటుంబ సభ్యుల గృహాల వద్దకు వెళ్లి స్వయంగా నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్యుడీషియల్ విచారణ సాగుతుందని, తొక్కిసలాటకు ఎవరైతే భాద్యులు అవుతారో వారందరిపై చర్యలు ఉంటాయన్నారు. అలాగే చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన కాదంటూ చైర్మన్ తేల్చి చెప్పారు.
Also Read: Karmas: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
ఏర్పాట్లు సరిగ్గా లేని ఒకటి రెండు చోట్ల ఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ ఏడాది పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులకు కల్పిస్తున్నామన్నారు. దర్శనానికి వెళ్లాలంటే తప్పనిసరిగా టోకెన్లు కావాలని మాత్రమే చెప్పినట్లు, తిరుమలకు భక్తులను తప్పక అనుమతిస్తామన్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు క్షమాపణ చెప్పాలని కోరారు కదా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తప్పు జరిగింది క్షమాపణ చెప్తే చనిపోయిన భక్తులు తిరిగిరారు కదా అంటూ చైర్మన్ జవాబివ్వడం విశేషం. జ్యుడీషియల్ ఎంక్వయిరీ లో అన్ని వివరాలు బయటకు వస్తాయని, తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా టీటీడీ పాలకమండలి అన్ని నిర్ణయాలు తీసుకుంటుందని చైర్మన్ అన్నారు.