CM Chandrababu: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక అసలేం జరిగింది? టీటీడీ ఛైర్మన్-ఈవో శ్యామలరావు మధ్య విభేదాలేంటి? సమన్వయం లోపమే అందుకు కారణమా? సీఎం చంద్రబాబు సమీక్షలో ఏకవచనంతో పిలిచే స్థాయికి ఎందుకెళ్లింది? ఇద్దరి మధ్య వాగ్వాదం వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కేంద్రాల జరిగిన తొక్కిసలాట ఘటన అనేక అంశాలను తెరపైకి తెచ్చింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకునే ప్రతీ నిర్ణయాలను అడ్డుకునేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా.
ప్రభుత్వం మారిన తర్వాత మొదట్లో ఈవో శ్యామలరావు- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బాగానే ఉండేవారట. టీటీడీలో సంస్కరణలకు ఛైర్మన్ పావులు కదపడం, బోర్డు సమావేశంలో ఓకే చేయడం చకచకా జరిగిపోయింది. దీన్ని గమనించిన ఈవో.. ఛైర్మన్‌పై కాసింత అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టారట.
ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. వీరి మధ్య విభేదాలతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. దాని ఫలితంగా ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. ఘటన తర్వాత సీఎం చంద్రబాబు నేరుగా ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అసలేం ఏం జరిగింది? తెలుసుకున్నారు.
ALSO READ: తిరుమల లడ్డుపై పవన్ వ్యాఖ్యలు చేసిన 108 రోజుల్లోనే ఇలా..?
చివరకు గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో, మంత్రులు, తిరుమలకు చెందిన కొందరు కీలక అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఛైర్మన్-ఈవో మధ్య మాటల యుద్ధం వేడెక్కింది.
సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ ఫిర్యాదు చేశారు. ఈవో తనను పట్టించుకోలేదని, ఛైర్మన్ అన్న గౌరవం కూడా లేదని తేల్చి చెప్పారట. మీరైనా ఆయనకు చెప్పండి కోరారట. ఒకానొక దశలో విచక్షణ మరిచిపోయి ఏక వచనంతో సంభోదించుకోవడంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఈ తతంగాన్ని చూసి మంత్రులే షాకయ్యారు. ఈలోగా ఓ మంత్రి జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రి ముందు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అంటూ ఈవోను మందలించే ప్రయత్నం చేశారట. ఈలోగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. మీరు వ్యవహరించే పద్దతి ఇదేనా అంటూ కాసింత స్వరం పెంచారు.
పరిధులు ధాటి మాట్లాడుతున్నారు, మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం లేదా? అంటూ మండిపడ్డారు. తాను-సీఎస్ సమన్వయంతో పని చేయడం లేదా? ఎందుకు మీరిద్దరు మాట్లాడుకోవడం లేదని సీఎం ప్రశ్నించినట్టు ఓ తెలుగు డైలీ రాసుకొచ్చింది. సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చిన సీఎం చంద్రబాబు, ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం, ముగ్గుర్ని అక్కడి నుంచి ట్రాన్సఫర్ చేయడం చకచకా జరిగిపోయింది.
వైసీపీ హయాంలో ఏపీలోని వివిధ విభాగాల నుంచి దాదాపు 8 మంది డిప్యూటేషన్‌పై తిరుమలకు వచ్చారట. వారంతా కీలకమైన పోస్టుల్లో నిమగ్నమయ్యారు. వారిని తొలగించే వరకు తిరుమలలో ప్రక్షాళన జరగదని కొందరు అధికారుల మాట.
రెండునెలల అధికార పార్టీకి చెందిన మంత్రులు దర్శనానికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించలేదని, వీఐపీల సేవలో తరిస్తున్నారట అక్కడి అధికారులు. రెండు నెలల కింద ఏపీకి చెందిన కేంద్రమంత్రి తిరుమల దర్శనానికి వెళ్లారట. ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని తేలింది. దర్శనం తర్వాత ఆయన వెళ్లిపోతున్న సమయంలో అప్పుడు అధికారులు వచ్చినట్టు సమాచారం. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, ఏకంగా అధికారులపై వేటు వేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.