TTD on Roja: మాజీ మంత్రి రోజాకు టీటీడీ పాలకమండలి షాకిచ్చింది. ఏపీ టూరిజం శాఖ మంత్రిగా రోజా ఉన్న సమయంలో శ్రీవారి దర్శనం టూరిజం టికెట్ల ద్వారా అవతవకలు జరిగాయని భావించిన పాలకమండలి, టూరిజం టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో టూరిజం శాఖలో రూ. 400 కోట్ల వరకు స్కామ్ జరిగిందని తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపణలు గుప్పించారు. శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో టూర్ ప్యాకేజీ గతంలో 24 బస్సులకు పర్మిషన్ ఇవ్వగా, అందులో తక్కువ సంఖ్యలో బస్సులు తిరిగినట్లు గతంలో కిరణ్ రాయల్ విమర్శించారు. ఇలా ఆ టికెట్ల కేటాయింపుపై విమర్శలు అధిక సంఖ్యలో వినిపించాయి. ఈ నేపథ్యంలో టూరిజం శాఖలకు కేటాయించే టికెట్ల విషయంపై పాలకమండలిలో తీవ్ర చర్చ సాగింది.
పాలకమండలిలో చర్చ అనంతరం టూరిజం శాఖ టికెట్లను రద్దు చేస్తున్నట్లు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు ప్రకటించారు. టూరిజం శాఖ టికెట్ల ద్వారా గతంలో ఔకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. టూరిజం శాఖ ద్వారా అనుమతులు పొందిన ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూములను సైతం రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకోవడం విశేషం.
గతంలో ఏపీ టూరిజంతో కర్ణాటక తెలంగాణ తమిళనాడు టూరిజం శాఖల నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించిన క్రమంలో, ఆ నివేదికల ఆధారంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్ గా తొలిసారి పాలక మండలి సమావేశం నిర్వహించిన బీఆర్ నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ 54వ టీటీడీ పాలకమండలి మొదటి సమావేశం కావడంతో, పాలక మండలి సభ్యులందరూ హాజరయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో సభ్యులందరూ భాగస్వామ్యం కావాలని, అధికారులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని బీ.ఆర్ నాయుడు అన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని తాము అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు, తిరుమల పవిత్రతను కాపాడేందుకు తమ వంతు భాద్యతగా వ్యవహరిస్తామని తెలిపారు.