Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్లు దేశ రైల్వే ముఖచిత్రాన్ని మార్చాయి. అత్యంత వేగం, అత్యాధునిక వసతులతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నాయి. ఈ రైళ్లలో పూర్తి స్థాయిలో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయో టాయిలెట్లలో రీసైకిల్ చేసిన నీటిని మళ్లీ ప్రయాణికులు అవసరాలకు వాడుతారనే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ప్రచారంలో ఉన్న వాస్తవం ఎంత?
బయో టాయిలెట్ల నీటిని ఏం చేస్తారంటే?
బయో టాయిలెట్ల నీటిని రీ సైకిల్ చేసి, వాటిని రైల్వే ప్రయాణికులకు అందిస్తారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. రైల్వే బయో టాయిలెట్ల నీటిని ప్రయాణికుల కోసం తిరిగి ఉపయోగించరు. బయో టాయిలెట్స్ లోని వ్యర్థాలను వాయురహిత బ్యాక్టీరియాను ఉపయోగించి శుద్ధి చేస్తారు. ఈ సూక్ష్మక్రిములు మానవ వ్యర్థాలను వాయువులుగా, నీటిగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ శుద్ధి చేసిన నీటిని రైలు పట్టాలపైకి వదులుతారు. ఈ నీళ్లు తాగడానికి గానీ, ఇతర అవసరాలకు ఉపయోగించేంత శుభ్రంగా ఉండవు. రైళ్లలో ప్రయాణికులు ఉపయోగించే నీటిని ఆయా రైల్వే స్టేషన్లలో నింపుతారు. ఆ నీటిని చేతులు, ముఖం కడుక్కోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. తాగడానికి బాటిల్ వాటర్ లేదంటే ఆన్ బోర్డ్ ప్యాంట్రీ సేవల ద్వారా అందిస్తారు.
బయో టాయిలెట్లలో వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తారంటే?
వందేభారత్ రైళ్లలోని బయో-టాయిలెట్లు పర్యావరణ అనుకూల పద్ధతిలో మానవ వ్యర్థాలను శుద్ధి చేస్తాయి. ఈ టాయిలెట్లలోని బ్యాక్టీరియా మానవ వ్యర్థాలను నీరు, బయోగ్యాస్‌లుగా విడదీస్తాయి.
⦿ మానవ వ్యర్థాల సేకరణ
రైళ్లలోని మరుగుదొడ్డి నుంచి మానవ వ్యర్థాలు కోచ్ క్రింద అమర్చబడిన బయో డైజెస్టర్ ట్యాంక్ లోకి వెళ్లేలా చేస్తారు.
⦿ వాయురహిత ప్రక్రియ
బయో-డైజెస్టర్ ట్యాంక్ లో వాయురహిత బ్యాక్టీరియా ఉంటుంది. దీనిని DRDO అధికారులు డెవలప్ చేశారు. ఈ బ్యాక్టీరియా మానవ వ్యర్థాలను సరళమైన భాగాలుగా విచ్ఛిన్నం చేస్తుంది.
⦿ కుళ్ళిపోయే ప్రక్రియ
మానవ వ్యర్థాలను బ్యాక్టీరియా మీథేన్, కార్బన్ డైయాక్సైడ్ లాంటి బయో గ్యాస్ లుగా విడగొడుతుంది. మరికొన్ని వ్యర్థాలు నీటిగా మారుతాయి.
⦿ రైల్వే ట్రాక్ మీదికి శుద్ధి చేసిన వ్యర్థాలు
శుద్ధి చేసిన మానవ వ్యర్థాలను రైల్వే ట్రాక్స్ మీద విడుదల చేస్తారు. శుద్ధి చేసిన నీరు, శుధ్ధి చేయని వ్యర్థాల కంటే తక్కువ హానికరం.
⦿ సాలిడ్ వేస్ట్ తగ్గింపు
బయో టాయిల్స్ లోని ఘన వ్యర్థాలను బ్యాక్టీరియా అతితక్కువ స్థాయికి తగ్గించబడతాయి.
బయో టాయిలెట్స్ తో ప్రయోజనాలు
⦿ తక్కువ కాలుష్యం: శుద్ధి చేయని వ్యర్థాలను ట్రాక్ లపైకి నేరుగా విడుదల చేయరు. ఫలితంగా పర్యావరణ కాలుస్యం తగ్గుతుంది.
⦿ మెరుగైన పరిశుభ్రత: బయో టాయిలెట్స్ కారణంగా రైల్వే ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది.
భారతీయ రైల్వే సంస్థ తమ సేవలను పర్యావరణ అనుకూలమైనవిగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ బయో-టాయిలెట్లను విస్తృతంగా అమల్లోకి తీసుకొచ్చింది.
Read Also: ఇకపై తత్కాల్ టికెట్ల పైనా రీఫండ్ పొందొచ్చు.. ఇండియన్ రైల్వేస్ సరికొత్త రూల్ గురించి తెలుసా?