TTD Key Decisions: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు సంబంధించి టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు తొలిసారి పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు టీటీడీ 54వ పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు బీఆర్ నాయుడు ప్రకటించారు.
టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు మూడు గంటల్లో దర్శన భాగ్యం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అన్యమత ఉద్యోగస్తులను గుర్తించి వారితో చర్చించడం జరుగుతుందని, విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇచ్చేందుకు కూడా వెనుకాడబోమని, లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామన్నారు. తిరుపతిలో గల శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చినట్లు, తిరుమలలో ఎవరైనా ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా రాజకీయ ప్రసంగాలు చేస్తే కచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
స్థానిక భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రతి నెల మొదటి మంగళవారం వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దుచేసి వేరొక ట్రస్టులో విలీనం చేస్తామని, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. పలుమార్లు నిత్య అన్నదానంపై ఆరోపణలు, వదంతులు వ్యాపిస్తున్న తరుణంలో నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని, మెనూలో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
Also Read: Surya Gochar: సూర్యుడి సంచారం.. నవంబర్ 16 నుంచి ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని, పాలకమండలి సమావేశంలో నిర్ణయించామన్నారు. శాశ్వత ఉద్యోగులకు రూ.15400, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.7530 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం అందిస్తామన్నారు. శారదా పీఠంకి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దుచేసి తాము స్వాధీనం చేసుకోవడం జరిగిందని, టూరిజం టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేసినట్లు, ఈ టికెట్ల వ్యవహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు.
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు తొలి సమావేశంతోనే ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు, అన్యమతస్తులను తొలగించడం, టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించడం వంటి నిర్ణయాలతో తనదైన మార్క్ బీఆర్ నాయుడు చూపించారని టీటీడీ అధికారులు, సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.