Childhood Cancer: ఇటీవల కాలంలో చిన్న పిల్లల్లో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతుండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. పెద్దల్లో వచ్చే క్యాన్సర్‌కు, పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌కు చాలా తేడా ఉంటుంది. మన దేశంలో ప్రతి ఏటా సుమారు 50 వేల నుంచి 60 వేల మంది చిన్నారులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే, వీటిలో చాలా వరకు లక్షణాలు మొదట్లో మామూలు జ్వరం లేదా నీరసంలాగే కనిపిస్తుంటాయి. దీంతో అసలు సమస్య ఏంటో తెలుసుకోవడం ఆలస్యం అవుతుంది. పిల్లల్లో ఈ వ్యాధి త్వరగా ముదిరిపోయే అవకాశం ఉండటంతో, ప్రతి తల్లిదండ్రులు దీనిపై కొంచెం అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.
పిల్లల్లో కనిపించే క్యాన్సర్లలో లుకేమియా. అంటే.. రక్తానికి సంబంధించిన క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. లింఫోమా, మెదడు ట్యూమర్లు కూడా సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో ఉన్నాయి. ఇవి పిల్లల ఆరోగ్యంపై త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. అసాధారణమైన మార్పులను తల్లిదండ్రులు గమనించడం ముఖ్యం.
చాలా రోజులుగా తగ్గని జ్వరం, కారణం తెలియకుండా బరువు తగ్గడం, తరచూ నీరసంగా ఉండటం, ఆకలి తగ్గడం, శరీరంలో ఎక్కడైనా వాపు లేదా గడ్డ కనిపించడం వంటి మార్పులను గమనించాలి. అయితే ఈ లక్షణాలు కనిపించాయంటే క్యాన్సర్ అని అర్థం కాదు. సాధారణంగా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇవి ఉండవచ్చు. కానీ లక్షణాలు తగ్గకుండా కొనసాగితే పిల్లల వైద్యుడిని సంప్రదించి కారణం తెలుసుకోవడం మంచిది.
Also Read: 7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!
భారత్‌లో పిల్లల క్యాన్సర్‌కు అవసరమైన ప్రత్యేక వైద్యం, నిపుణుల సేవలు ప్రధానంగా పెద్ద నగరాల్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. దీంతో గ్రామాలు, చిన్న పట్టణాల్లోని కుటుంబాలు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. ప్రయాణ ఖర్చులు, చికిత్స ఖర్చులు, ఆసుపత్రికి చేరుకోవడంలో ఆలస్యం వంటి సమస్యలు కుటుంబాలపై అదనపు భారాన్ని పెంచుతాయి.
పిల్లల్లో క్యాన్సర్‌కు ఒకే కారణం ఉండదు. కణాల్లో జరిగే మార్పులు, జన్యుపరమైన కారణాలు, కొన్ని వారసత్వ పరిస్థితులు ఇందుకు కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో పర్యావరణంలోని కాలుష్యం, కొన్ని రసాయనాల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లల క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశాలు 80 శాతం వరకు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. భారత్‌లో కూడా వ్యాధిని త్వరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం, చికిత్స ఖర్చులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరెంతో మంది పిల్లలకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చు.
తల్లిదండ్రుల పాత్ర ఇందులో చాలా కీలకం. పిల్లల ఆరోగ్యంలో సాధారణంగా కనిపించని మార్పులు ఉంటే రోజులు గడిచే వరకు వేచి ఉండకుండా ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగని ప్రతి లక్షణాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడం పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. చికిత్స సమయంలో పిల్లలకు ధైర్యం ఇవ్వడం, వారి భావాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.
Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక Passkeysను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు!