Tirumala Update: అసలే కార్తీకమాసం చివరి సోమవారం. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు.
తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 75,737 మంది భక్తులు దర్శించుకోగా.. 23,208 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.14 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
నేడు వైజాగ్ లో కార్తీక దీపోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానాలు మరియు హిందూధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపంలో పవిత్ర కార్తీక దీపోత్సవం జరుగనుంది. వైజాగ్‌లోని భక్తులందరూ ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం పొందవలసిందిగా టీటీడీ సాదరంగా ఆహ్వానిస్తోంది.
Also Read: Astrology 25 November 2024: ఈ రాశుల వారు ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్త
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వేంకటేశ్వరుని పంచలోహ విగ్రహాలకు పూజలు నిర్వహించి, సంప్రదాయ వైదిక ఆచారాలను అనుసరించి టీటీడీ అర్చకులు పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్తీక దీపోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కార్తీక దీపం యొక్క దివ్యమైన కాంతిని అనుభవించడానికి మరియు భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులకు ఇది ఒక అపూర్వ అవకాశం. భక్తులందరూ పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకను ఘనంగా నిర్వహించవలసిందిగా టీటీడీ కోరుతోంది.