TTD Update on Dharshanam: తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టూరిజం శాఖ ద్వార కూడా భక్తులకు శ్రీవారి దర్శనం సౌకర్యాలను కల్పించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర పర్యాటక శాఖ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టూరిజం ద్వారా శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించడంపై చర్చ సాగింది. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా మార్చి పర్యాటకరంగంలో 20 శాతం వృద్ధి రేటు సాధించి యువతకు ఉపాధి కలిపించే విధంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ద్వార భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంలో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. కూటమి అధికారంలోకి రాగానే టూరిజం ద్వారా శ్రీవారి దర్శనభాగ్యానికి శుభం కార్డు వేశారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా భాద్యతలు నిర్వర్తించిన కాలంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం విధానాల్లో భక్తులకు టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది.
ఈ సౌకర్యం వల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. అయితే అవకతవకల నేపథ్యంలో టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీలు గురువారం సీఎం సమీక్షలో చర్చించారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Farmers Benefit Schemes: రైతన్నలకు పెన్షన్.. ఇలా చేస్తే చాలు..
అయితే గతంలో మాదిరిగా వెయ్యి టికెట్లను కేటాయిస్తారా లేక టికెట్లను కుదిస్తారా? పెంచుతారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద టూరిజం శాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కల్పించడం హర్షించదగ్గ విషయం. ఈ నిర్ణయంతో సుదూర ప్రాంతాలలో ఉన్న భక్తులకు మేలు చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తే, టూరిజం శాఖ ద్వార కూడ భక్తులు టికెట్ పొందే అవకాశం కలుగుతుంది.
ఇక,
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారము, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.