Farmers Benefit Schemes: రైతన్నలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన కేంద్రం, తాజాగా రైతన్నకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనితో ఎందరో రైతన్నలకు మేలు చేకూరనుంది. మరెందుకు ఆలస్యం.. ఆ పథకం ఏమిటి? రైతులకు పెన్షన్ ఎలా ఇస్తారు? ఈ పథకంతో కలిగే పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం రైతన్నల కోసం ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తుల సమయంలో రైతన్నలకు అండగా నిలిచేందుకు పలు పథకాలను కూడా అమలు చేస్తున్నారు. తాజాగా కేంద్రం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రైతలన్నకు అధిక మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా చిన్న, సన్న కారు రైతులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నిత్యం వ్యవసాయ పనుల్లో ఉండే వీరు, వయసు పైబడిన తరువాత ఏం చేయలేని పరిస్థితిలో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. తమ ఖర్చుల కోసం కూడ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇలాంటి రైతులను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలోని ఎందరో రైతన్నలకు పెన్షన్ అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. రైతన్నలు ఈ పథకం ద్వార లబ్ది పొందేందుకు అర్హులు కాగా, 18 నుండి 40 ఏళ్ల లోపు వయస్సు గల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నెలనెలా రూ. 55 నుంచి రూ. 200 వరకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన రైతులకు 60 ఏళ్లు నిండిన వెంటనే, ప్రతి నెలా రూ. 3000 పెన్షన్ అందజేస్తారు. ఒక వేళ పథకంలో పేరు నమోదు చేసుకున్న రైతు మరణిస్తే, అతని భార్యకు నెలకు రూ. 1500 పెన్షన్ అందజేస్తారు.
ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వార రైతులకు పెన్షన్ ఇచ్చే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని చెప్పవచ్చు. 60 ఏళ్ల తర్వాత రైతన్నలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వార లబ్ది పొందాలనుకున్న రైతులు నేరుగా పోస్టాఫీస్, బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చిన దరఖాస్తును పూరిస్తే చాలు.. మీకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే నెలనెలా ప్రీమియం చెల్లించడం మరచిపోవద్దు. 60 ఏళ్ల తర్వాత ఇంటి వద్దనే పెన్షన్ పొందండి.
Also Read: హైదరాబాద్ వాసులూ జాగ్రత్త.. ఎండలు రఫ్ ఆడిస్తాయట, వారి ప్రాణాలకు ముప్పు!
ఇదిఇలా ఉంటే త్వరలోనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వార కేంద్రం రైతుల ఖాతాలకు 19 వ విడత నిధులను విడుదల చేస్తోంది. ఒక్కో రైతుకు పథకం ద్వార ఏడాదికి రూ. 6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నగదును మూడు విడతలుగా జమ చేయనుండగా, 24 వ తేదీ రైతన్న ఖాతాలకు రూ. 2 వేలు జమ కానున్నట్లు సమాచారం. అయితే ఈ నగదు జమపై కేంద్రం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.