Tirumala News: తిరుమల వచ్చే భక్తులకు శుభవార్త. అక్టోబర్ నెలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది టీటీడీ. తొలివారంలో రెండు రోజులు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచన చేసింది.
మాసం ఏదైనా ఒక్కటే. తిరుమలలో భక్తలు రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతుండడంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది టీటీడీ. అంతేకాదు భక్తుల రద్దీ తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
అక్టోబర్ 1 అనగా గురువారం, అక్టోబర్ 5న సోమవారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మినహాయింపు ఇచ్చింది. ప్రతీరోజూ స్వామిని సుమారు 80 వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. మరో 30 వేల మంది భక్తులు దర్శనం కోసం వేచి ఉంటున్నారు. అక్టోబర్ పెరటాసి మాసం కావడం, వరుస సెలవులు ఉండటంతో రద్దీ పెరిగే అవకాశం ఉందని భావించింది.
ఈ క్రమంలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు సంబంధించి ముందు రోజుల్లో సెప్టెంబర్ 30, అక్టోబర్ 4న ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది టీటీడీ. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ALSO READ: అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం!
మరోవైపు బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతోంది. జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు జేఈవో. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రణాళికతో పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో భక్తుల రద్దీకి తగినట్టుగా క్యూ లైన్లు, బ్యారికేడ్లు వంటివి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం, ఆధ్యాత్మిక ఆనందం కలిగేలా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలన్నారు.