Tirumala News: తిరుమలకు వచ్చే భక్తులను దృష్టిలోపెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. లేటెస్టుగా తిరుమల కొండపై ప్రైవేట్ హోటళ్లకు సంబంధించి మరో నిర్ణయం తీసుకుంది. కొండపై హోటళ్ల అద్దెలను భారీగా తగ్గించింది. అద్దె గడువు పెంచింది. అలాగే కొత్త హోటళ్ల నిర్వహణకు ఆమోదముద్ర వేసింది.
గతంలో మూడేళ్ల వరకు మాత్రమే గడువు ఉండేది. ఇప్పుడు ఐదేళ్ల వరకు పెంచింది. తిరుమలలో చిన్న హోటళ్లు, పెద్ద హోటళ్ల కోసం కొత్తగా టెండర్లు ఆహ్వానించింది. జూన్ 23న మొదలైన ఈ టెండర్ల ప్రక్రియ వచ్చేనెల అంటే జూలై 19తో ముగియనుంది. టెండర్ల విషయంలో కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. టెండర్ వేసిన వ్యక్తి కచ్చితంగా హిందువు అయి ఉండాలి.
హోటల్ రంగంలో కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలి. ఎలాగ లేదన్నా కనీసం 10 హోటళ్లను నడుపుతూ ఉండాలి. ఇక హోటళ్ల అద్దెల విషయానికి వద్దాం. కౌస్తుభం హోటల్ అద్దెను రూ.16.20 లక్షలు ఉండేది. ఇప్పుడు దాన్ని రూ. 12.15 లక్షలకు తగ్గించారు. సప్తగిరి హోటల్ అద్దె నెలకు రూ. 13 లక్షలు ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.9.75 లక్షలకు తగ్గించారు.
ఎంఎంటీ క్యాంటీన్‌కు రూ.5.05 లక్షల వరకు అద్దె చెల్లించే వారు. ఇకపై రూ.3.80 లక్షలకు తగ్గింది. పీఏసీ-వెస్ట్‌కు రూ.4.44 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు కుదించారు. పీఏసీ-నార్త్‌కు రూ.4.10 లక్షల నుంచి రూ.3.10 లక్షలకు తగ్గించింది. హెచ్‌వీసీకు రూ.3.33 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు తగ్గింది. ఎస్‌ఎంసీ క్యాంటీన్‌కు రూ.3.88 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ.
ALSO READ: అసలు రోజా లాజిక్ ఏంటి? అలాగైతే వైసీపీ పోటీ చేయదా?
మరోవైపు శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు జరగనున్నాయి. జూన్ 30 నుంచి జూలై 2 వరకు వాటిని నిర్వహించనున్నారు. గురువారం అంటే జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. జూలై 3న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు టీటీడీ సిబ్బంది. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొపుతారు.
తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఆలయ ప్రాంగణంలోని గోడలు, పూజా సామగ్రి వంటి వస్తువులను శుద్ధి చేస్తారు. ఆ కార్యక్రమంలో ఆలయం లోపలా, బయటలా కస్తూరి పసుపు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలు కలసిన పవిత్ర జలంతో ఆలయమంతా ప్రోక్షణం చేస్తారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.