తిరుపతి లడ్డూ దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఎవరు తిరుపతి వెళ్లినా లడ్డు తీసుకుని బంధువులకు, శ్రేయోభిలాషులకు పంచుతారు. ఆ లడ్డు టేస్టే వేరు. తిరుపతి దేవుడిపై భక్తితోపాటు లడ్డూ టేస్ట్‌పై మక్కువతో ఎక్కువగా లడ్డూను తీసుకుంటారు. తిరుపతి ప్రసాదానికి క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి తిరుపతి లడ్డూ పై సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలను విస్మయానికి లోనుచేశాయి.
తిరుమలలోని శ్రీవారి ప్రసాదంపైలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో నాణ్యత లేని పదార్థాలతో తిరుపతి లడ్డూలను తయారు చేశారని ఆరోపించారు. తిరుపతి పుణ్యక్షేత్ర పవిత్రతనే దెబ్బ తీశారని ఆగ్రహించారు. అన్నదానంలోనూ నాణ్యత లేకుండా చేశారని, దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలనూ అపవిత్రం చేశారంటూ విరుచుకుపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీరియస్ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. దివ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తిరుమల ప్రసాదాంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని ఖండించారు. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ ఇలాంటి మాటలు మాట్లాడరని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలూ చేయరని పేర్కొన్నారు.
రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాయుడు ఎంతటి నీచానికైనా దిగజారుతారని ఆయన మరోమారు నిరూపించుకున్నారని విమర్శించారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచడానికి తిరుమల ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరి చంద్రబాబు కూడా నత కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్‌గా చేసిన వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.