TTD News: తిరుమలకు జనవరి 2025 నెలలో ప్లాన్ చేశారా.. అయితే తప్పక ఈ రోజుల్లో తిరుమల వెళ్లారంటే చాలు, ఆ దేవదేవుని దర్శనంతో పాటు మరో భాగ్యం కూడా మీకు కలగనుంది. ఇంతకు జనవరి నెలలో తిరుమలలో ఏ ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయో మీ కోసం మీ ముందుకు..
తిరుమల శ్రీవారిని దర్శించే భాగ్యం దొరికినా చాలు.. అంతటి భాగ్యమా అనుకుంటారు భక్తులు. శ్రీనివాసా శరణు శరణు అంటే ఏ కోరికైనా ఇట్టే తీరిపోవాల్సిందే. అందుకే ఏడుకొండల స్వామి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తుంటారు. తిరువీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. ఇలా తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా, టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భాద్యతలు స్వీకరించిన సమయం నుండి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారని చెప్పవచ్చు.
తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. జనవరి నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాల గురించి ట్వీట్ చేశారు. జనవరి 9న చిన్న శాత్తుమొర, జనవరి 10న వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం, జనవరి 11న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం, జనవరి 15న ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం, జనవరి 17న తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం, జనవరి 18న శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం, జనవరి 19న పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు, జనవరి 20న శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, జనవరి 23న అధ్యాయనోత్సవాలు సమాప్తం, జనవరి 24న తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు, జనవరి 25న సర్వ ఏకాశశి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం. జనవరి 27న మాస శివరాత్రి, జనవరి 29న శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలను నిర్వహించనున్నారు.
Also Read: TTD News: తిరుమలలో ఆ సమస్యకు ఇక చెల్లు.. గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ
జనవరి నెలలో తిరుమలకు వెళ్లాలని అనుకున్నారా.. అయితే ఈ విశేష పర్వదినాల రోజుల్లో వెళ్తే, స్వామి వారి దర్శన భాగ్యంతో పాటు, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొనే భాగ్యం మీకు దక్కనుంది. మరెందుకు ఆలస్యం.. శ్రీవారిని దర్శించండి.. గోవిందా నామస్మరణ సాగించండి!