Tirumala News: తిరుమల వెంకటేశ్వరుడ్ని దర్శించుకోవాలంటే ఆయన కరుణ ఉండాలి. మన ప్రయత్నాలు ఎన్ని చేసినా సాధ్యం కాదు. స్వామి దగ్గరకు వెళ్లాలంటే భక్తులు ముందుగా ప్లాన్ చేసుకుంటారు. లేకుంటే స్వామి కరుణించడని నమ్ముతారు. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, ఆర్జిత సేవలు, వసతికి సంబంధించి టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ.
గోవింద.. గోవింద నామస్మరణతో తిరుమల గిరులు నిత్యం మార్మోగుతాయి. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడతారు. ముఖ్యంగా వివిధ రకాల సేవలు, 300 రూపాయల టికెట్ల కోసం భక్తులు ఎగబడతారు. శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు.
దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం టీటీడీ ప్రతి నెలా ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, ఆర్జిత సేవ, వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. ఈ నెల 18న బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
సెప్టెంబర్‌కు సంబంధించి ఆర్జిత సేవల టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందినవారు జూన్ 21 నుంచి 23న మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన భక్తులకు ఆయా టికెట్లు కేటాయించనుంది టీటీడీ.
ALSO READ: జగన్‌కు బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేతలు గుడ్ బై
స్వామి సేవలకు భక్తులు ఎగబడతారు. దానికి టికెట్లు దొరకడం కష్టం. జూన్ 23న అంటే వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాలకు సంబంధించి టికెట్లను విడుదల చేయనుంది.
అదేరోజు జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ కోటాను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తుంది. జూన్ 24న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను విడుదల కానుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన కోటా ఓపెన్ చేయనుంది.
జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది టీటీడీ.
జూన్ 25న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల టీటీడీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల, తలకోన ప్రాంతాల్లో గదుల కోటా బుకింగ్ ఓపెన్ చేయనుంది.
ఈ నెల 30న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ ముఖ్యంగా తిరుమల-తిరుపతి, పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) కోటా విడుదల కానుంది. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లను టీటీడీ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది. అప్పుడప్పుడు పరిస్థితిని బట్టి చిన్నచిన్న మార్పులు చేసే అవకాశం లేకపోలేదు.