TTD News: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఓ కేటుగాడు బిగ్ షాకిచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తన ఫోటోతో వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ ఏర్పాటు చేసుకుని భక్తులను మోసగిస్తున్నారని, అటువంటి వారి పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ చైర్మన్ హెచ్చరించారు. చైర్మన్ హెచ్చరికల వెనుక అసలేం జరిగిందంటే?
తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. అటువంటి భక్తులలో అమాయకులకు దర్శనం కల్పిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేసే వారిని కట్టడి చేసేందుకు టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్భంగానే ఓ కేటుగాడి వ్యవహారం చైర్మన్ దృష్టికి వచ్చింది. తక్షణం స్పందించిన చైర్మన్.. ఈ విషయంపై పూర్తి విచారణ సాగించి భక్తులను మోసగించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్, పోలీస్ అధికారులను ఆదేశించారు.
చైర్మన్ బీ.ఆర్ నాయుడు ఫోటోను వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ గా ఏర్పాటు చేసుకుని ఓ వ్యక్తి శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నట్లు టీటీడీ అధికారుల దృష్టికి వచ్చింది. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని ఎన్నారై భక్తులను టార్గెట్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు చైర్మన్ గుర్తించారు. పలువురు భక్తులు కూడా ఈ విషయంపై చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చైర్మన్ ఆదేశించారు. కాగా ఎన్నారై భక్తులను మోసం చేస్తున్న వ్యక్తి వివరాలను ఆరా తీసిన పోలీసులకు, దిమ్మ తిరిగిన విషయం తెలిసింది. బస్సులను మోసగించిన వ్యక్తి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ జావెద్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు యొక్క పూర్తి వివరాలను ఆరా తీస్తున్న పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు.
ఈ విషయంపై చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా ట్వీట్ చేస్తూ.. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను మోసగించే వారి పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. టీటీడీ నిబంధనల మేరకు భక్తులకు దర్శన సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఇటువంటి వారిని సంప్రదించి భక్తులు మోసపోవద్దని సూచించారు. కాగా చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి తిరుమలలో ఇటువంటి ఆగడాలకు పూర్తిగా కట్టడి చేశారనే చెప్పవచ్చు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, భక్తులను మోసగిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏది ఏమైనా టీటీడీ అధికారికంగా విడుదల చేసే ప్రకటనలను పరిగణలోకి తీసుకొని, భక్తులు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం పొందాలని టీటీడీ సూచిస్తోంది.
Also Read: Today Gold Rate: అయ్యో ఎంత పనైపోయింది.. మళ్లీ బంగారం ధర పెరిగిందిగా..
ఇక,
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో హోంమంత్రి వంగలపూడి అనిత భేటీ అయ్యారు. టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ ని మర్యాదపూర్వకంగా హోంమంత్రి అనిత కలిశారు. ఉపమాకలోని టీటీడీ అనుబంధ ఆలయమైన వేంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి సహకరించమని చైర్మన్ ను అనిత కోరారు. 2017 లో టీటీడీ కి ఆలయాన్ని అప్పగించినట్లు, ఐదు ఎకరాలలో ఉన్న అత్యంత ప్రాశస్త్యం గల ఆలయం గత ప్రభుత్వ హాయంలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఉపమాక ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, పూర్వవైభవం తీసుకురావాలని చైర్మన్ ని హోంమంత్రి కోరగా, చైర్మన్ సానుకూలంగా స్పందించారు. సకాలంలో ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని చైర్మన్ తెలిపారు.