Saria Water falls: ఎండాకాలం వచ్చిందంటే చాలామంది వేర్వేరు ప్రాంతాలను సందర్శిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీలో ఎత్తైన కొండలు, జలపాతాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ప్రమాదాలు సైతం తెచ్చిపెట్టిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా విశాఖ ఏజెన్సీలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. చూడటానికి వెళ్లిన ఇద్దరు జలపాతంలో గల్లంతు అయ్యారు.
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ అనంతగిరి మండలం జీనబాడు గ్రామం. ఈ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు జలపాతాలు ఉన్నాయి. అరకు వెళ్లిన యువకులు సరియా జలపాతానికి వెళ్తుంటారు. అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తారు. ఆపై తమ ఫోన్లతో సెల్ఫీలు దిగుతారు.
తాజాగా విశాఖ సిటీ పూర్ణా మార్కెట్‌కు చెందిన ఆరుగురు యువకులు అరకు వెళ్లారు. అక్కడి నుంచి సరియా జలపాతం (Saria Water falls) సందర్శనకు ఆదివారం వెళ్లారు. జలపాతంలో స్నానం కోసం దిగిన సమయంలో ప్రమాదవశాత్తు వాసు, నర్సింహం జారిపడ్డారు. ఆ తర్వాత వారి ఆచూకీ కోసం మిగిలిన నలుగురు ప్రయత్నించారు. ఎలాంటి ఫలితం లేదు.
చివరకు స్థానికులు సహాయం తీసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. చీకటి పడడంతో గాలింపు ఆపేశారు. చివరకు నలుగురు యువకులు అనంతగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. గల్లంతైన ఇద్దరు ఫిషింగ్ హార్బర్‌లో ఓ చేపల దుకాణాల్లో పని చేస్తున్నారు.
ALSO READ: రాజకీయాల్లోకి మాజీ ఐపీఎస్ ఏబీవీ ఎంట్రీ
గజ ఈతగాళ్లను మోహరించారు. వారి కోసం జలపాతంలో గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. గల్లంతైన ఇద్దరు యువకుల వయస్సు దాదాపు 19 నుంచి 23 మధ్య ఉండవచ్చని అంటున్నారు. వాసు, నర్సింహా గల్లంతు విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
వారి కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అరకు వెళ్లి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కంటతడి పెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: ఇకపై భూమనకు చుక్కలు చూపిస్తామన్న టీటీడీ ఛైర్మన్