Tirumala Places: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన తిరుపతికి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి టూరిస్టులు నిత్యం అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పరిసర ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఏడు కొండలపై ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన తిరుమల క్షేత్రం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగానూ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. కానీ చాలా మంది ప్రజలకు అక్కడ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని తెలియదు. అంతేకాకుండా తిరుపతికి కొత్తగా వెళ్లే వారు అక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
ఆకాశగంగ తీర్థం..
ఆకాశ గంగ తీర్థం అనేది తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇది దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆకాశ గంగను ఆంజనేయుడు తపస్సు చేసిన స్థలంగా భావిస్తారు, అంజనాదేవి ఇక్కడే ఆంజనేయుడిని గర్భం ధరించింది. ప్రతిరోజూ శ్రీవారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశ తీర్థాన్ని తిరుమల నంబి వంశస్థులు తీసుకువస్తారు. అలాగే ఈ క్షేత్రానికి ఇంకో కథ కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో భూదేవిని రక్షించడానికి వచ్చినప్పుడు, అతని పాదముతో ఒక నీటి ప్రవాహం ఏర్పడి ఆకాశం నుండి కిందకు పడి, ఆకాశ గంగాగా ఏర్పడిందని చెబుతారు.
కుమారధార తీర్థం..
కుమారధార తీర్థం ఒక పుణ్యక్షేత్రం, ఇది శేషాచల కొండల్లో ఉంది. ఇది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వాయువ్య దిశలో ఉంది. ఈ తీర్థం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇక్కడ విష్ణువు తపస్సు చేశాడని, తారకాసురుడిని సంహరించిన తరువాత, బ్రహ్మహత్యా పాపానికి భయపడి ఇక్కడ తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయని, ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. కుమారధార తీర్థం పేరు ఎలా వచ్చిందంటే, కుమారస్వామి ఈ ప్రదేశంలో అష్టాక్షర మంత్రాన్ని జపించాడని అందుకని ఈ తీర్థానికి కుమారధార తీర్థం అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి నాడు ఇక్కడ కుమారధార ముక్కోటి జరుపుతారు.
తుంబుర తీర్థం..
తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో రమణీయమైన ప్రకృతి మధ్య నెలకొన్న పవిత్రమైన సరస్సు తుంబురు తీర్ధం. ఈ నీటికి అద్వితీయమైన శక్తులు ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఈ నీరు పాపాలను తొలగించడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదించేందుకు సహకరిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడి సహజ అందాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతాయి.
రామకృష్ణ తీర్థం..
రామకృష్ణ తీర్థం.. తిరుమల పర్వత ప్రాంతంలో ఉన్న ఒక పుణ్య తీర్థం. ఇది శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో సృష్టించబడిందని చెబుతారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి పర్వదినం రోజున ఇక్కడ స్నానం చేయడం చాలా పుణ్యమని నమ్ముతారు.
పాపవినాశన తీర్థం..
తిరుమల కొండల మధ్యలో, శ్రీ వేంకటేశ్వరుడి ఆధ్యాత్మిక పరిసరాల్లో వెలసిన ఈ జలపాతం పేరు పాపవినాశనం. ఇది ఒక ప్రకృతి సిద్ధమైన జలపాతం. ఇక్కడ స్నానం చేస్తే పూర్వ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం శ్రీ హరి దేవుడు తన శుద్ధమైన తేజస్సును ప్రసరించి ఈ జలాన్ని పవిత్రం చేశారని చెబుతారు.
కపిల తీర్థం..
తిరుమల కొండపై మెట్ల బాటలో ప్రముఖ శైవ క్షేత్రం కపిల తీర్ధం ఉంటుంది. అద్భుతమైన ద్రావిడుల నిర్మాణశైలి ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. కపిల మునిచే ప్రతిష్టించబడిన ఇక్కడి శివలింగాన్ని కపిలేశ్వరుడు అని పిలుస్తారు. జలపాతం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
పాండవ తీర్థం..
తిరుమలలోని పవిత్ర తీర్థాలలో పాండవ తీర్థం ఒకటి, ఇది దాని దైవత్వం, పవిత్రతకు ప్రసిద్ధి చెందింది. మోక్ష కథ కలిగిన ఈ తీర్థం పాండవులతో కూడా కొంత సంబంధాన్ని కలిగి ఉంది. 12 సంవత్సరాల వనవాస సమయంలో ఇద్దరు పాండవ సోదరులు, యుధిష్ఠరుడు మరియు అర్జునుడు ఈ ప్రదేశంలో స్నానం చేశారని నమ్ముతారు. పాండవ తీర్థం కొండ దిగువన ఉంది మరియు నరిష్మ కొండకు ఎదురుగా ఉంది.పదవ తీర్థంలో స్నానం చేయడం వల్ల విధి మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ ప్రదేశంలో ఆవులను దానం చేయవచ్చు.
ఈ నీటిలో స్నానం చేయడం నిజంగా ఉత్తేజాన్నిస్తుంది, చెడులను కడిగివేసి శుభాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు. ఆలయ పరిపాలన ద్వారా నిర్మించబడిన ఒక వేదిక ఉంది, ఇక్కడ ప్రవహించే నీటిని భక్తులు ముందుగా చేతిలోకి తీసుకునేలా మళ్లిస్తారు. తిరుపతి సందర్శించే ప్రతి యాత్రికుడు ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి.
తలకోన జలపాతం..
శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్‌కు సమీపంలో ఉండే అద్భుతమైన జలపాతం ‘తలకోన’. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే చెబుతారు. ఈ ప్రాంతానికి ప్రముఖ పిక్నిక్ స్పాట్ గా కూడా పేరుంది. ప్రకృతి అందాల మధ్య పర్వతారోహణకు ఇది అనువైన ప్రదేశం.