Potato Peel Benefits: దాదాపు అందరూ బంగాళదుంప తొక్కలను పనికిరానివిగా భావించి పారేస్తారు. కానీ బంగాళదుంప తొక్కలు అనేక సమస్యలలో మీకు సహాయపడతాయి. అంతే కాకుండా మీ ఇంటి పనిని కూడా సులభతరం చేస్తాయి. నిజం ఏమిటంటే బంగాళదుంప తొక్కలలో ఇంటి పనులలో సులభంగా ఉపయోగించగల అనేక ఉపయోగకరమైన లక్షణాలు దాగి ఉన్నాయి. వీటిలో ఫైబర్, ఐరన్, విటమిన్ బి6, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
ఇవి మీ ఆరోగ్యానికి ఉపయోగపడటమే కాకుండా ఇంటిని శుభ్రపరచడం, గార్డెనింగ్, స్కిన్ కేర్ వంటి అనేక రంగాలలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంతకీ బంగాళదుంప తొక్కలు ఎన్ని రకాలుగా మనకు ఉపయోగకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుంందాం.
చర్మ సౌందర్యం:
ముఖ చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా మార్చడంలో బంగాళదుంప తొక్కలు మీకు చాలా బాగా సహాయపడతాయి. బంగాళదుంప తొక్కలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మంపై ఉన్న టానింగ్ నల్లటి మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. తొక్కలను గ్రైండ్ చేసి.. ఆ పేస్ట్‌ను ముఖంపై 10-15 నిమిషాలు అప్లై చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని క్రమం తప్పకుండా వాడటం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
వంటగది పాత్రలు శుభ్రం చేయడం:
పాత్రలు ఎక్కువగా కాలిపోయినా లేదా మరకలు ఉన్నా.. వాటిని బంగాళదుంప తొక్కలపై కాస్త ఉప్పు లేదా బేకింగ్ సోడాతో కలిపి రుద్దండి. తొక్కల ఉపరితలం కొద్దిగా గరుకుగా ఉంటుంది. దీని కారణంగా ఇది స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ఫలితంగా ఇది పాత్రల మెరుపును తిరిగి తెస్తుంది.
జుట్టు పెరుగుదల,మెరుపు కోసం:
బంగాళదుంప తొక్కలను నీటిలో మరిగించి.. చల్లబరిచి, ఆ నీటితో జుట్టు వాష్ చేసుకోండి. ఇందులో ఉండే స్టార్చ్, పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా సహజమైన మెరుపును అందిస్తాయి. ఈ హోం రెమెడీస్ వారానికి రెండుసార్లు వాడటం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
డార్క్ సర్కిల్స్:
కళ్ళ కింద నల్లటి వలయాలు, వాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. చల్లని బంగాళదుంప తొక్కలను మీ కళ్ళపై కొన్ని నిమిషాలు ఉంచండి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
Also Read: శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. ఇలా చేయండి !
మొక్కలకు సేంద్రియ ఎరువుగా:
బంగాళదుంప తొక్కలు మొక్కలకు అద్భుతమైన సేంద్రియ ఎరువుగా పనిచేస్తాయి. వీటిని పొడిగా లేదా నేరుగా కంపోస్ట్‌తో కలిపి మట్టిలో కలపవచ్చు. దీనివల్ల నేల సారవంతం పెరిగి మొక్కలు వేగంగా పెరుగుతాయి.
బంగాళదుంప తొక్కలు పోషకాలతో సమృద్ధిగా ఉండటమే కాకుండా.. అనేక ఇంటి పనులలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే మరోసారి బంగాళదుంపల తొక్క తీసేటప్పుడు.. తొక్కలను పారవేసే ముందు మరోసారి ఆలోచించండి. అవి మీ ఇంటి పనులను చాలా సులభతరం చేస్తాయి.