Poisonous snake news: ప్రకృతి ఏ క్షణానైనా మనల్ని ఆశ్చర్యపరచగలదు. కొన్నిసార్లు అది భయపెడుతుంది కూడా. ఇప్పుడు ఇలాంటి ఓ ఘటన, అనకాపల్లి జిల్లాలోని వాలాబు గ్రామంలో చోటు చేసుకుంది. విషపూరితమైన పాము ఒకటి కాదు.. ఏకంగా 30 గుడ్లు పెట్టిందంటే ఊహించండి ఆ పరిస్థితేంటి! ఇది అక్కడి ప్రజల్లో కలకలం రేపింది. అసలేం జరిగిందంటే?
బుసలతో బెదిరించిన తల్లి పాము
వాలాబు గ్రామ శివారులోని పొలాల దగ్గర అసలు విషయం మొదలైంది. ఓ రైతు తన పొలానికి వెళ్లినప్పుడు ఓ పెద్ద పాము గుడ్లు పెట్టి కాపలా కాస్తుండటాన్ని చూశాడు. అతనితోపాటు ఉన్న కాపరిపై ఆ పాము బుసలు కొడుతూ, ఎవరూ దగ్గరికి రాకుండా హెచ్చరిస్తూ కనిపించింది. భయంతో వెనక్కి పారిపోయిన వారు వెంటనే గ్రామస్తులకు చెప్పారు. విషయం చుట్టుపక్కల ఏరియాలో వైరల్ అయిపోయింది.
దాడికి కాదు.. జాగ్రత్తకు వచ్చిన అటవీశాఖ
విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు అటవీశాఖకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది కూడా చాలా బాధ్యతగా వ్యవహరించారు. పామును హింసించకుండా, గుడ్లకు ఏ హానీ కలగకుండా.. ప్రదేశాన్ని పూర్తిగా కవర్ చేస్తూ వల ఏర్పాటు చేశారు. అక్కడి రైతులకు, కాపరులకు పలు సూచనలు ఇచ్చారు. ఇక్కడ కొన్ని రోజులపాటు ఎవ్వరూ తిరగకండి. పాము పిల్లలు బయటకు వచ్చిన తర్వాత మేమే చూసుకుంటాం అంటూ చెప్పారు.
గుడ్ల నుంచి బయటకు వచ్చిన 30 పాము పిల్లలు
అటవీశాఖ అంచనాలు మిస్ కాలేదు. నెలరోజుల తర్వాత మళ్లీ సంఘటన స్థలానికి వచ్చిన అధికారులు చూసిన దృశ్యం అసాధారణం. గుడ్ల లోపలి నుంచి 30 చిన్న పాము పిల్లలు బయటకు వచ్చాయి. ఇవి ఇప్పటికీ విషపూరిత పాములే అయినా, వాటి దేహం చిన్నగా ఉండటం వల్ల పెద్దగా ముప్పు కలిగించకపోయినా, జాగ్రత్త మాత్రం తప్పదు.
Also Read: IRCTC updates: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి.. రైళ్లకు జనరల్ బోగీల పెంపు.. ఎప్పుడంటే?
బాక్స్‌లో బందీ.. అడవిలోకి విముక్తి
అటవీశాఖ అధికారులు ఎంతో నైపుణ్యంతో, శ్రద్ధతో ప్రతి పాము పిల్లను జాగ్రత్తగా బాక్సుల్లో వేసి సేకరించారు. ఆ తర్వాత వాటిని శంకరం రిజర్వ్ ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లి సురక్షితంగా వదిలేశారు. ఇది పాములకు హాని కలగకుండా, మనుషులకూ ప్రమాదం లేకుండా ఉండేందుకు తీసుకున్న చక్కటి నిర్ణయం.
స్నేక్ స్నాచర్లు చెబుతున్న మాట
ఈ సందర్భంగా పాములను పట్టే స్నేక్ స్నాచర్లు కూడా ఓ విషయం చెబుతున్నారు. పాము మన ఇంట్లోకి వస్తే, చంపకండి. దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. మేము వాటిని సురక్షితంగా అడవిలో వదిలేస్తామంటూ సూచించారు. పాములు కూడా ప్రకృతి భాగమే. అవి మనకు ముప్పుగా కనిపించవచ్చు కానీ, అవి కూడా జీవితం కోసం పోరాడే జీవులే అని తెలియజేశారు.
ఈ సంఘటన పలు విషయాలను తెలియజేస్తోంది. పాములను చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాటిని హింసించకుండా, చంపకుండా అటవీశాఖ లేదా స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలి. వారు వాటిని సురక్షితంగా వదిలేస్తారు. ఇదే నిజమైన పరిష్కారం. వాలాబు గ్రామ సంఘటన అందరికీ మంచి మెసేజ్‌ను ఇచ్చింది. విషపూరిత పాము పెట్టిన గుడ్ల నుంచి పాము పిల్లలు బయటపడి అడవిలోకి వెళ్లడంతో.. వాలాబు గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అక్కడి పొలాల్లో భయం తగ్గింది. ప్రకృతి, మనుషుల మధ్య సమతుల్యత ఎలా ఉండాలో ఈ సంఘటన మళ్లీ గుర్తుచేసింది.