వల్లభనేని వంశీ. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మిగతా నేతల సంగతి ఏమో కానీ, ఈయన పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పట్నుంచి వివిధ కేసుల్లో ఆయన జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే, ఇంకో కేసులో రిమాండ్ పడుతోంది. ఇలా.. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఇటీవల బెయిల్ లభించింది. ఏసీబీ కేసులో పీటీ వారెంట్ జారీ అమలు చేస్తున్నారంటూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. వెకేషన్ కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకుంది. వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయబోతోంది.
టీడీపీ ఆఫీస్ పై దాడి సహా వల్లభనేని వంశీపై చాలా కేసులున్నాయి. అందులో గనుల అక్రమ తవ్వకాల కేసు ఒకటి. అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలుగజేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా గనులశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నారని అభియోగాలు మోపారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించగా.. మే 29న ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తాజాగా వెకేషన్ కోర్టులో ఆయనకు బెయిలొచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేయాడానికి నిర్ణయించింది. దీనికోసం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులోని రాష్ట్రప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (AOR) కార్యాలయ అధికారిని ఆదేశించింది.
మిగతా కేసుల్లో..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వల్లభనేని వంశీ పాత్రకూడా ఉందన్నది ఆయనపై ఉన్న ప్రధాన కేసు. అయితే ఇందులో ఆయన ప్రత్యక్ష చర్య లేకపోయినా నిందితుల్ని ప్రోత్సహించారనే ఆరోపణలున్నాయి. అయితే ఆ కేసులో ఆయనకు వెంటనే బెయిలొచ్చింది. ఈ క్రమంలో ఆయన ఓ తప్పు చేశారు. తనకు బెయిల్ రాదేమోననే ఉద్దేశంతో కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించారు. కేసు విత్ డ్రా చేసుకునేలా చేశారు. అయితే ఆ కిడ్నాప్ వ్యవహారం బయటపడటంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. కిడ్నాప్ కేసుతోపాటు, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. దీంతో వంశీ జైలులోనే కాలం గడపాల్సి వచ్చింది. అటు, ఫోర్జరీ సంతకాలతో ఇళ్లపట్టాలు పంపిణీ చేశారనే మరో కేసు కూడా విచారణలో ఉంది. ఈ కేసులన్నిటి వల్ల ఆయనకు బెయిలు వచ్చినా బయటకు రాలేకపోతున్నారు.
కేసుల సంగతి అటుంచితే, ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయినట్టు వార్తలు వస్తున్నాయి. శ్వాసకోశ సమస్యలతో ఆయన బాధపడుతున్నారని అంటున్నారు. పూర్తిగా బరువు తగ్గిపోయారు. అసలు వంశీని చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయనపై కక్షసాధిస్తున్నారంటూ భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలతో కలసి గవర్నర్ ని కలసి ఆమె ఫిర్యాదు చేశారు. అయితే చట్టప్రకారం మాత్రం ఆయన విడుదలకు ఇంకా టైమ్ రాలేదు. అటు బెయిల్ వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టడం విశేషం.