బెయిల్ పై విడుదలైనా వల్లభనేని వంశీ టాక్ ఆఫ్ ది టౌన్ గానే ఉన్నారు. తాజాగా ఆయన వెయిటింగ్ వ్యవహారంతో వార్తల్లోకెక్కారు. మూడు గంటలకు పైగా ఆయన పోలీస్ స్టేషన్లో వేచి చూశారంటూ ఆయన అభిమానులు రచ్చ చేస్తున్నారు. అటు వైసీపీ కూడా ఆరోగ్యం బాగాలోని వంశీని మూడు గంటలకు పైగా చెక్క బెంచీపై కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆయన్ను కావాలనే టార్గెట్ చేశారని, పోలీస్ స్టేషన్ లో వేచి చూసేలా చేశారని అంటున్నారు. అసలింతకీ వంశీ ఎందుకు వేచి చూశారు, ఎవరికోసం చూశారు..? ఈ వ్యవహారం ఎందుకంత సంచలనంగా మారింది.
3 గంటలు పోలీస్ స్టేషన్లో..
వల్లభనేని వంశీకి బెయిలిచ్చిన హైకోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. పోలీస్ విచారణకు ఆయన అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో ఆయన పోలీసులు పిలిచినప్పుడల్లా స్టేషన్ కి వెళ్లడం తప్పనిసరి. తాజాగా ఆయన్ను అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు గన్నవరం స్టేషన్ కి పిలిపించారు. విజయవాడ ఆస్పత్రిలో ఉన్న ఆయన అక్కడ్నుంచి గన్నవరం వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ కి వెళ్లారు. అక్కడ విచారణ అధికారి రావాలంటూ ఆయన్ను వేచి చూడాలని చెప్పారు పోలీసులు. మూడు గంటల సేపు వంశీ పోలీస్ స్టేషన్లోనే వేచి చూశారు. మధ్యాహ్నం భోజనం చేశారు. తీరా విచారణ అధికారి రాలేదంటూ ఆయన్ను తిరిగి వెళ్లిపోవాలని సూచించారు పోలీసులు. మళ్లీ విచారణకు ఎప్పుడు రావాలనే విషయాన్ని లేఖ ద్వారా తెలియజేస్తామన్నారు.
బెయిల్ కండిషన్లు..
వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యేనే కావొచ్చు, వీఐపీనే కావొచ్చు. కానీ ఆయన 10 కేసుల్లో ముద్దాయి, 10 కేసుల్లో కూడా బెయిల్ తీసుకుని బయట ఉన్నారు. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిపించినా రావాల్సిన పరిస్థితి ఆయనది. అలాంటిది.. మైనింగ్ కేసులో పోలీసులు విచారణకు పిలిపించి 3 గంటలు వెయిట్ చేయించారంటూ వైసీపీ రాద్ధాంతం చేయడం ఇక్కడ విశేషం. పోలీస్ స్టేషన్లో ఆయనకు ఎలాంటి అసౌకర్యం లేదని తెలుస్తోంది. కొంతసేపు చైర్ లో కూర్చున్నారు, మరికొంత సేపు బెంచ్ పై కూర్చున్నారు. 3 గంటల తర్వాత తిరిగి ఆయన విజయవాడ ఆస్పత్రికి వెళ్లిపోయారు.
మాస్క్, బ్యాండేజ్..
ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన తర్వాత జైలులో ఉన్న వంశీ పూర్తిగా మారిపోయారు. బరువు తగ్గారు, జుట్టుకి రంగు వేయకపోవడంతో ఆయన అసలు వయసు కనపడుతోంది. ఇక బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో ఆయన ఎప్పుడూ నోటికి చేయి అడ్డు పెట్టుకుని కనిపించేవారు. అనారోగ్యంతో ఉన్న ఆయనకు బెయిలివ్వాలంటూ అప్పట్లో ఆయన భార్య కూడా ఆవేదన వ్యక్తం చేశారు. బెయిలొచ్చిన తర్వాత వంశీ హుషారుగా కనపడ్డారు. నాలుగు రోజులపాటు ఆయన ఇల్లే కేంద్రంగా రాజకీయ హడావిడి జరిగింది. వంశీ వెళ్లి జగన్ ని కలిసొచ్చారు. వంశీని కలిసేందుకు ఇతర నాయకులు ఆయన ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా హుషారుగానే ఉన్న వంశీ, ఆ తర్వాతి రోజే ఆస్పత్రిలో చేరారు. తిరిగి ఇప్పుడు మళ్లీ మొహానికి మాస్క్, చేతికి బ్యాండేజ్ తో కనపడుతున్నారు. కావాలనే ఆయన ఆస్పత్రిలో చేరి సింపతీ కోసం డ్రామాలాడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అప్పటి వరకు హుషారుగా ఉన్న వంశీ, కేసుల భయంతో బెయిల్ క్యాన్సిల్ అవుతుందేమోనని ముందే అనారోగ్య సమస్యలు చెబుతున్నారని, ఆస్పత్రిలో చేరిపోయారని అంటున్నారు. అటు వైసీపీ మాత్రం బెయిలొచ్చినా ఆయనపై పోలీసులు కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని, పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఖాళీగా 3 గంటలు కూర్చోబెట్టి తిరిగి పంపించివేశారని ఆరోపిస్తున్నారు.