Vijayawada: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టిడిపి నేత వంగవీటి రాధ, జనసేనలోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఆయన రేపు లేకుంటే ఎల్లుండి జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఉన్నట్లుండి ఈ మార్పు వెనుక అసలు ఏం జరిగింది.. జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
విజయవాడ రాజకీయాల్లో ఇప్పుడు వంగవీటి రాధా పేరు మార్మోగుతోంది. నగర మేయర్‌గా ఆయన బరిలోకి దిగేందుకు సిద్ధవుతున్నారు. ఇప్పటికే కూటమిలోని ప్రధాన పార్టీలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దాదాపుగా ఆయనకు ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా అందుకున్న సమాచారం మేరకు జనసేన నుంచి బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పోయినవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటల వ్యవధిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు వంగవీటి రాధా. మరి వారి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఇరు పార్టీల మద్దతుతో బెజవాడ మేయర్ అభ్యర్థిగా భావించారు. కాకపోతే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కీలకంగా మారింది. తాజాగా జనసేన నుంచి వంగవీటి రాధా బరిలోకి దిగాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకు రకరకాల కారణాలు లేకపోలేదు.
నార్మల్‌గా అయితే ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలు వలస వస్తుంటారు. తొలిసారి టీడీపీ నుంచి జనసేనలోకి వలస వెళ్లనున్నారు వంగవీటి రాధ. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. జనసేనలో పవన్ తర్వాత ఆ స్థాయి నాయకుడు ఎవరూ లేదు. రంగా ఆ పార్టీలోకి వెళ్తే జనసేన మరింత బలంగా తయారు అవుతుందని, దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణాతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ మరింత బలంగా అవుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ALSO READ: విజయసాయిరెడ్డికి మళ్లీ ఏమైంది.. బాల్‌ఠాక్రేతో పోలిక పెట్టి, ఆ తర్వాత..
అంతేకాదు గత ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో టీడీపీ నేతలు బీజేపీ, జనసేన వైపు వెళ్లి పోటీ చేసి గెలిచిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. కూటమిలోని నేతలు చర్చలు తర్వాత ఈ విధంగా బలమైన వ్యక్తిని తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. వంగవీటి రాధా దాదాపు మేయర్ అభ్యర్థి కావడం తేలడంతో వైసీపీ నుంచి బలమైన నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా దేవినేని అవినాష్ అయితే బెటరని అంటున్నారు. ఇరుకుటుంబాల మధ్య వైరం ఈనాటిది కాదని అంటున్నారు. దానికితోటు కమ్మ కమ్యూనిటీ అవినాష్ వైపు మొగ్గు చూపే అవకాశముందని లెక్కలు వేసుకుంటున్నారు.