CURE Act 2026: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్యూర్ చట్టం అమలుతో పుర పాలనలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఈ మూడు కార్పొరేషన్లలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న మున్సిపల్ చట్టం 1959లోని నిబంధనలను ఆసరాగా చేసుకుని కార్పొనేషన్ల అధికారులు, పాలక మండలి ఆదాయం, వ్యయం, అభివృద్ది ప్రతిపాదనలతో పాటు పాలక మండలి తీసుకునే నిర్ణయాలను కూడా గోప్యంగా ఉంచే వారు. కానీ ఈ నెల 2వ తేదీ నుంచి సర్కారు క్యూర్ పరిధిలో అమల్లోకి తీసుకువచ్చిన క్యూర్ చట్టం 2026లో సర్కారు ఆదేశాలు, అభివృద్ది ప్రతిపాదనలతో పాటు పాలక మండలి, స్టాండింగ్ కమిటీ తీసుకునే నిర్ణయాలతో పాటు కార్పొరేషన్ల ఆదాయ, వ్యయ వివరాలను కూడా ఎలాంటి దాపరికం లేకుండా పబ్లిక్ డొమైన్ లో పెట్టేందుకు వీలుగా నిబంధనలను విధించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ పాలనలో అధికారాలు, బాధ్యతలు, న్యాయపరమైన ప్రక్రియలతో పాటు ప్రజలకు సమాచార హక్కును మరింత బలోపేతం చేసేలా కీలకమైన నిబంధనలను పొందుపరిచారు. ముఖ్యంగా కార్పొరేషన్ల ఆదాయ వనరులలో ముఖ్యమైన ఆస్తి పన్నుల వివాదాలు, కోర్టు కేసులు, మున్సిపల్ అధికారుల బాధ్యత, పోలీసుల సహకారం, ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం, ఆర్థిక లావాదేవీల బహిరంగ ప్రకటన వంటి అంశాల్లో స్పష్టమైన నిబంధనలను ఈ కొత్త చట్టం ద్వారా అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు.
కోర్టును ఆశ్రయించాలంటే సగం పన్ను చెల్లించాల్సిందే
ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లకు సింహా భాగం ఆదాయం నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారానే సమకూరుతున్నందున, ట్యాక్స్ వర్తింపు, వసూలు, నిర్మాణంలో డీవియేషన్లకు వర్తింపజేస్తున్న అదనంగా వంద శాతం ఆస్తి పన్ను వంటి అంశాలకు సంబంధించి చాలా మంది పన్ను బకాయిదారులు తాత్కాలిక ఉపశమనం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నందున, కార్పొరేషన్లకు రావాల్సిన ట్యాక్స్ బకాయిలు భారీగా పేరుకుపొవటం, ఎళ్ల తరబడి చెల్లింపుల్లేకుండా నిల్చిపోతుండటంతో మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా బలహీనపడుతున్నట్లు గుర్తించిన అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించిన ఎలాంటి వివాదంపైన కోర్టును ఆశ్రయించాలంటే ఇప్పటి వరకు బకాయిదారుడు చెల్లిస్తున్న ఆస్తి పన్నులో సగం కార్పొరేషన్ కు చెల్లించిన తర్వాతే కోర్టును ఆశ్రయించేలా కొత్త క్యూర్ చట్టంలో నిబంధనలను తీసుకువచ్చారు. చట్టాన్ని అమలు చేసే క్రమంలో కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తీసుకున్న చర్యలపై నేరుగా కోర్టును ఆశ్రయించకుండా ఒక నెల ముందు నోటీసు ఇచ్చి, వచ్చిన స్పందనను బట్టి గరిష్టంగా ఆరు నెలల్లో కేసును ఫైల్ చేసుకునేలా నిబంధనలను తీసుకువచ్చారు. భారీగా బకాయిపడ్డ పన్ను చెల్లింపుదారుల వివరాలను గోప్యంగా ఉంచే విధానానికి కొత్త క్యూర్ చట్టం స్వస్తి పలికి, రూ.లక్షకు పై చిలుకు ఆస్తిపన్ను బకాయి పడ్డ వారి వివరాలను కార్పొరేషన్లు బహిరంగ పరిచే విధానాన్ని కొత్త క్యూర్ చట్టం ద్వారా అమలు చేయనున్నారు.
పోలీసులు సహకారించాలి
కొత్త క్యూర్ మున్సిపల్ చట్టాన్ని అమలు చేయడంలో పోలీసు యంత్రాంగం సహకరించాల్సిన బాధ్యతను కూడా చట్టంలో నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ చట్టం లేదా దాని కింద రూపొందించే నిబంధనలు, ఆదేశాలు, బైలాస్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసు అధికారులు సంబంధిత మున్సిపల్ అధికారులకు సమాచారమివ్వాలని, చట్టబద్ధమైన విధులు నిర్వర్తించేందుకు మున్సిపల్ అధికారులకు అవసరమైన సహాయం అందించాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు పోలీసు వ్యవస్థను అనుసంధానం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్న విజిలెన్స్ విభాగం మరింత పటిష్టం కావటంతో మున్సిపల్ విధుల్లో బాధ్యతాయుతంగా పని చేసేలా కొత్త చట్టంలో నిబంధనలను అమలు చేయనున్నారు.
కమిషనర్‌కు విస్తృత న్యాయాధికారాలు
కాలం చెల్లిన మున్సిపల్ యాక్టు 1959 స్థానంలో తీసుకువచ్చిన కొత్త క్యూర్ మున్సిపల్ చట్టంలో మున్సిపల్ కమిషనర్లకు కొన్ని విస్తృత న్యాయాధికారాలను కేటాయిస్తూ చట్టంలో నిబంధనలను రూపకల్పన చేశారు. వివిధ కేసుల్లో చర్యలు తీసుకోవడం, ఉపసంహరించుకోవడం, చట్టబద్ధంగా వీలైన కేసులను రాజీ కుదుర్చడం, ఎన్నికల పిటిషన్లను ఎదుర్కోవడం, ఆస్తిపన్ను అంచనాలను సవరించడం, సంస్థకు రావాల్సిన బకాయిలు, పరిహారాలను రికవరీ చేయడానికి కేసులు వేయడం వంటి అధికారాలు ఈ చట్టం ద్వారా కమిషనర్లకు సంక్రమించనున్నాయి. మున్సిపల్ సంస్థలపై దాఖలయ్యే కేసులను ఎదుర్కోవడం, కొన్ని సందర్భాల్లో స్టాండింగ్ కమిటీ అనుమతితో కేసులను రాజీ కుదుర్చడం, సంస్థ తరఫున న్యాయ సలహా పొందడం వంటి అధికారాలు కూడా కమిషనర్‌కు వర్తించనున్నాయి.
ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి మూడు నెలల డెడ్ లైన్
క్యూర్ పరిధిలోని ప్రస్తుతమున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రజలచే ఎన్నుకోబడే పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టేందుకు కోత్త క్యూర్ చట్టంలో మూడు నెలల గడువు విధించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేయని సభ్యులు సభలో కూర్చోవడానికి లేదా సభ్యుడిగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుండదు. పదవీకాలం ప్రారంభమైన మూడు నెలల్లోగా లేదా పాలక మండలి నిర్వహించే మొదటి మూడు సమావేశాల్లోగా, ఏది ఆలస్యమైతే అది పూర్తయ్యేలోగా ప్రమాణ స్వీకారం చేయకపోతే సదరు సభ్యుడు సభ్యత్వం కోల్పోయేలా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో సంస్థకు దరఖాస్తు చేసుకుంటే అదనపు సమయం ఇచ్చే అవకాశం కూడా చట్టం కల్పించింది. దానికి కూడా కొన్ని షరతులను వర్తింపజేసే అవకాశముంది.
Also Read: క్యాన్సర్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం.. మార్జిన్ 30 శాతానికి కట్!