Varla Ramaiah: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న డాక్టర్ సునీతను భక్త ప్రహ్లాదుడు తో, జగన్‌ను హిరణ్యకశిపుడు తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పినతండ్రి హత్యకు గురైతే ఐదేళ్ల పాలనలో హంతకులను అరెస్ట్ చేయించకపోగా.. న్యాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సునీతపై జగన్ విమర్శలు చేయడంపై వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐ పిటిషన్ ఉపసంహరణ వెనుక మర్మమేంటి?
వివేకా హత్య కేసుపై గతంలో సీబీఐ దర్యాప్తు కావాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన జగన్, తానే ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని ఎందుకు ఉపసంహరించుకున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. అంతేకాకుండా, కేసాను విచారిస్తున్న సీబీఐ అధికారులను ప్రతి అడుగునా ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. డాక్టర్ సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిస్తే జగన్ ఎందుకు వణికిపోతున్నారో, విచారణకు ఎందుకు భయపడుతున్నారో రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సొంత కుటుంబాన్ని రోడ్డున పడేసిన జగన్
తండ్రిని చంపిన నిందితులను పట్టుకోవాలని తిరుగుతున్న సునీతను బెదిరించడమే కాకుండా, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. న్యాయం కావాలని కోరిన సొంత తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను రోడ్డుపాలు చేశారని విమర్శించారు. జగన్‌కు సొంత బాబాయ్ ప్రాణం, చెల్లెలి కన్నీరు, పిన్ని మంగళసూత్రం కంటే హత్య చేసిన ముద్దాయిలే ఎక్కువయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాయం జరిగిన ఏ పౌరుడైనా ముఖ్యమంత్రిని కలవడం ప్రజాస్వామ్యబద్ధమని, సునీతకు న్యాయం జరిగి తీరుతుందని, హిరణ్యకశిపుడి వంటి జగన్‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Also Read: నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం.. వైసీపీ అసలు వ్యూహం ఇదేనా?