Amaravati: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు మంత్రి పార్థసారథి. చట్టపరంగా ఇబ్బందులు ఎదురైతే, పార్టీ పరంగా కోటా కల్పిస్తామన్నారు. న్యాయస్థానం తన తీర్పులో న్యాయపరంగా ముందుకు వెళ్లాలని చెప్పిందని, రిజర్వేషన్లు ఇవ్వవద్దని చెప్పలేదని గుర్తు చేశారు.
బీసీ గణనను త్వరగా పూర్తి చేసి ఆమోదించి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని కుండ బద్దలు కొట్టేశారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీ పార్టీదని అని గుర్తు చేశారు. దాన్ని పెంచి 34 శాతం చంద్రబాబు ప్రభుత్వం చేసిందన్నారు. ఆ తర్వాత రెండు, మూడు సార్లు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ అంశంపై అనేక తీర్పులు వచ్చాయని వివరించారు. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదన్నది అసలు విషయమని, కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు వాస్తవాల ఆధారంగా రిజర్వేషన్లు 60 శాతానికి పెంచిన విషయాన్ని వివరించారు. రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్ల పరంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే అవకాశముందన్నారు. రిజర్వేషన్లు కల్పించడానికి సుప్రీంకోర్టు ఏమైతే విధివిధానాలు చెప్పిందో వాటిని అమలు చేయడంలో ఆనాడు వైసీపీ విఫలమైందని, బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందన్నారు.
ALSO READ: కూటమి ప్రభుత్వం, వైసీపీకి షాక్.. 34శాతం బీసీ రిజర్వేషన్లు అంశం, పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ఆనాడు చేయకపోవడం వల్ల బలహీన వర్గాలకు న్యాయం జరిగేదన్నారు. మా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ వేశామని, దానికి సంబంధించి డేటా ఉందన్నారు. డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఇంకా అందజేయకపోవడంతో తీర్పు వ్యతిరేకంగా రావడానికి కారణమైందన్నారు. ఇది బలహీన వర్గాలకు చాలా బాధాకరమని అన్నారు. టీడీపీ ఇచ్చిన 34 శాతం కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పార్టీ పరంగా కొనసాగిస్తామన్నారు. న్యాయపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నా, దాన్ని వదులుకునే పరిస్థితి లేదని, దానిపై ఫైట్ చేస్తామన్నారు.