TGSRTC Special Buses for Dussehra: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. పండుగ సమయంలో బస్ డిపోలు, బస్ స్టేషన్లలో పెరిగే రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 30 మంది, అంతకంటే ఎక్కువ మంది కలిసి ప్రయాణించే బృందాల కోసం కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు, హాస్టళ్లు, కళాశాలల నుంచే ప్రత్యేక బస్సులను నడపనుంది.
దసరా సమయంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. దీంతో ప్రధాన బస్ స్టేషన్లు, డిపోల వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయాణికులు పెద్ద మొత్తంలో సామానుతో బస్ డిపోకు చేరుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ కొత్త సౌకర్యాన్ని అందిస్తోంది. ఒకే ప్రాంతం నుంచి 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒకే చోటుకు వెళ్లాలనుకుంటే.. వారి ప్రాంతం నుంచే ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్‌లోని పెద్ద నివాస కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లలో దసరా సమయంలో ఒకే ప్రాంతానికి వెళ్లే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాళ్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులను సంప్రదించి ప్రత్యేక బస్సును కోసం అభ్యర్థించవచ్చు. ప్రయాణికుల సంఖ్య, వెళ్లాల్సిన ప్రాంతం లాంటి వివరాలను బట్టి అధికారులు సర్వీసును ఏర్పాటు చేస్తారు. తగినంత డిమాండ్ ఉంటే బస్సు నివాస ప్రాంతం నుంచే బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో ప్రయాణికులు ముందుగా ప్రధాన బస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
దసరా సెలవుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా హాస్టళ్లు, కాలేజీల్లో ఉండే విద్యార్థులకు ఈ ప్రత్యేక సర్వీసులు ఉపయోగపడనున్నాయి. హాస్టల్, కాలేజీల నుంచి 30 మంది, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. వారి క్యాంపస్ లేదంటే హాస్టల్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసును పొందే అవకాశం ఉంటుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చే డిమాండ్‌ను పరిశీలించి టీజీఎస్ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేయనుంది.
దసరా సమయంలో సాధారణ బస్సులతో పాటు ప్రత్యేక సర్వీసులు కూడా నడుస్తుండటంతో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నేరుగా వారి ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా రద్దీని కొంతవరకు తగ్గించవచ్చని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.
Read Also: ‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!