Delhi: కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతుందా? దశాబ్దం పాటు తాపీగా గడిచిపోయిన మోదీ సర్కార్, మూడో విడత ప్రతిపక్షం నుంచి అతి పెద్ద సవాల్ ఎదురైందా? పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం ఈవెంట్ ప్రధాని మోదీ అనుకున్నట్టుగా జరగలేదా? ఎప్పుడు అరగంట లేకుంటే 40 నిమిషాల్లో భేటీలు ముగించే ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబుతో దాదాపు గంటా 40 నిమిషాలు ఏం చర్చించారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సీఈసీ వ్యవహారం తలనొప్పిగా మారింది. గడిచిన కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారం మోదీ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. దీనిపై అంతర్జాతీయ పత్రికలు తాటికాయంత అక్షరాలతో బ్యానర్ వార్తలు రాసుకొచ్చాయి. నిరసనకారులను గమనించిన ప్రధాని మోదీ, సీఈసీకి జెడ్ ప్లస్ భద్రత ఇచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రధాని మోదీ కాసింత ఆందోళనకు గురయ్యారన్నది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ మాట.
ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టారు. గురువారం రోజంతా బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు, సాయంత్రం ఐదుగంటలకు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య సమావేశం ఎప్పుడు జరిగినా అరగంట లేకుంటే 40 నిమిషాలు జరిగేది. ఈసారి గంటా 40 నిమిషాలు వీరిద్దరి మధ్య భేటీ సాగిందంటే.. ప్రధాని మోదీ ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
నార్మల్‌గా అయితే దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ కంటే చంద్రబాబు సీనియర్. అందులో రాజకీయాలు ఆయనతో మాట్లాడడం ఎలాంటి తప్పులేదు. ఈ సమయంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులపై నేతలు కూలంకుషంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సీఈసీని టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై నేతలిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఇష్యూని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో అన్నది వేరే విషయం.
దీంతోపాటు పవన్ గ్రిడ్ మాదిరిగా వాటర్ గ్రిడ్ అంశాన్ని సీఎం చంద్రబాబు.. ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్టు అందులోని మరొక పాయింట్. ఎల్‌నినో ఉన్నా లేకున్నా దక్షిణాది రాష్ట్రాల మధ్య నిత్యం నీటి గొడవలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ కు గ్రిడ్ ఎలాగ వుందో, వాటర్‌కు ఓ గ్రిడ్ తీసుకొస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు సమాచారం. దేశంలోని దాదాపు మేజర్ నదులు తూర్పు వైపు సముద్రంలో కలుస్తాయి. దీనివల్ల ఏటా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు అవుతుంది. నదులను లింక్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి సమస్యకు ఉండదని, దీనివల్ల ఆ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక-తమిళనాడు, మహారాష్ట్ర-తెలంగాణ, ఏపీ-తెలంగాణ మధ్య నీటి సమస్యకు పరిష్కారం అవుతుందని అన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: దసరా వేళ ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. పట్టణాలకు ఆ విధంగా, గ్రామాలకు మరొకలా
నీటి సమస్య ఎప్పుడైతే పరిష్కారం అవుతుందో అన్నిరకాల పంటలు పండుతాయని, విదేశాలకు ఎగుమతులకు చేసే మంచి అవకాశం ఏర్పడుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్‌లో తాను ఏర్పాటు చేసిన ఐఎస్‌బీ మాదిరిగా, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్-ఐఎస్ఏ తీసుకొస్తే బాగుంటుందని సూచన చేసినట్టు సమాచారం. పంటలకు టెక్నాలజీ జోడించడం, విదేశాలకు ఎగుమతి చేయడం వంటివి చేయవచ్చని వివరించినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు చెప్పిన అంశాలను ప్రధాని సానుకూలంగా విన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో దీనిపై అంచెలంచెలుగా కార్యాచరణ చేపట్టడం ఖాయమన్న మాట ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.