Varra Ravinder Wife: తన భర్తను జైలులోనే చంపేస్తారు అంటూ వర్రా రవీంద్ర భార్య సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో వర్రా రవీంద్ర భార్య మాట్లాడుతూ… 8వ తేదీన కర్నూలు టోల్ ప్లాజా వద్ద తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, 11వ తేదీ వరకు అరెస్ట్ చేసినట్టు ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న వీడియోలను ఆమె మీడియాకు చూపించారు. మూడు రోజులు తన భర్తను చిత్రహింసలు పెట్టారని, పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన భర్తను ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని చెప్పారు. చిత్రహింసలకు గురి చేసి వారికి అనుకూలంగా తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు.
అసలు నిజాలను మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారని తెలిపారు. అదుపులోకి తీసుకునేముందు వర్రా రవీంద్ర ఎవరూ కూడా పోలీసులకు తెలియదని అన్నారు. వర్రా రవీంద్ర అని కన్ఫామ్ చేసుకున్న తరవాత మార్కాపురం తీసుకువెళ్లారని చెప్పారు. ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియకుండా ముగ్గురి ముఖాలకు మాస్కులు వేశారని అన్నారు. వర్రాను కొడుతుంటే ఎక్కడ చనిపోతాడోనని బయపడ్డామని ఆయన పక్కన ఉన్న స్నేహితులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్రా మీరు చెప్పినట్టు ఒప్పుకోనని చెప్పినా వినకుండా పోలీసులు చిత్రహింసలు పెట్టారని తెలిపారు. ఈ విషయాలన్నీ వర్రాతో ఉన్న ఆయన స్నేహితులే చెప్పారని అన్నారు.
తాము చెప్పినట్టు వినకుండా మీ స్నేహితులను కూడా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. తన భర్తను కొట్టిన దెబ్బలను ఆయనే స్వయంగా చూపించారని చెప్పారు. పై నుండి వచ్చిన ఆదేశాలతోనే పోలీసులు తన భర్తపై చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. పోలీసులకు తన భర్తపై ఎలాంటి కోపం లేదని, పై నుండి చంద్రబాబు, హోంమంత్రి ఇచ్చిన ఆదేశాలతోనే తన భర్తను చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే తన భర్తపై కర్కషంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మీ భార్యను, పిల్లలను కూడా కేసుల్లో ఇరికిస్తామని వర్రాను బెదిరిస్తున్నారని అన్నారు. తన భర్త పేరుతో పద్దెనిమిది ఫేక్ అకౌంట్లు సృష్టించారని తన భర్త ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టలేదని చెప్పారు.