మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, పాలకులు కాస్త ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితుల్ని మెరుగుపరచడంతోపాటు, భవిష్యత్ గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం మినహా ఇంకేదీ ఉచితంగా వద్దని అన్నారు వెంకయ్య.
గతంలో కూడా వెంకయ్య నాయుడు ఫ్రీబీస్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏపీలో ఆల్ ఫ్రీ అంటూ ఓట్లకోసం రాజకీయం చేస్తున్నారని, జనాల్ని ఆకట్టుకోడానికి వారి భవిష్యత్తునే పణంగా పెడుతున్నారని అన్నారు. ఒకేదేశం – ఒకే ఎన్నిక అనే అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అలా చేస్తే భవిష్యత్ అంధకారం
అన్నీ ఫ్రీ, ఫ్రీ అంటూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు జనాలను ఆకట్టుకుంటున్నారని, దీనివల్ల వారి భవిష్యత్తే అంధకారంలోకి వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్య నాయుడు. పథకాలు ప్రకటించేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తుంచుకోవాలని ఆయన నాయకులకు హితవుపలికారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. అప్పులు కూడా పుట్టలేని స్థితికి తెలుగు రాష్ట్రాలు వెళ్లిపోయాయని చెప్పారు. అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలన్నారు వెంకయ్య.
బీఆర్ఎస్ చేసిన తప్పులు
తెలంగాణ అప్పులకు సంబంధించి ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న అప్పులు రూ.6.69 లక్షల కోట్లు అని అసెంబ్లీలో చెప్పారు రేవంత్ రెడ్డి. ఇతర బకాయిలతో కలిపి తెలంగాణ అప్పులు రూ.7.05 లక్షల కోట్లుగా ఉన్నాయని, దివాళా తీసిన రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తమకు అప్పగించి వెళ్లిందని విమర్శించారు. బీఆర్ఎస్ దుబారా, అవినీతి వల్లే తెలంగాణ అప్పులపాలైందనేది కాంగ్రెస్ వాదన. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
వైసీపీ చేసిన అప్పులు
ఇటు ఏపీలో కూడా ఇంచుమించు పరిస్థితి ఇలాగే ఉంది. వైసీపీ హయాంలో విపరీతంగా అప్పులు చేశారు. ఉచిత పథకాలంటూ ఖజానాని ఖాళీ చేశారు. పోనీ ఉచిత పథకాలతో ప్రజలకు మేలు జరిగిందా అంటే అదీ లేదు. అమ్మఒడికి చెల్లించిన డబ్బుని మద్యం రేట్లు పెంచి నాన్న బుడ్డితో లాగేశారని టీడీపీ విమర్శలు చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఏపీ పరిస్థితి కాస్త కుదుట పడుతోంది. వైసీపీ హయాంలో ఆర్థికంగా ఏపీ దివాళా అంచులకు వెళ్లగా.. కూటమి ప్రభుత్వంలో నష్టనివారణ చర్యల్ని మొదలు పెట్టారు సీఎం చంద్రబాబు.
ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని పాలన సాగించాలని చెప్పారాయన. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై మరింత అర్థవంతంగా చర్చ జరగాలన్నారు. తాను మాత్రం ఒకేదేశం ఒకే ఎన్నికకు మద్దతిస్తున్నట్టు చెప్పారు.