Vijayasai Reddy: అవునంటారు, కాదంటారు.. తెలుసంటారు, తెలియదంటారు.. పాలిటిక్స్‌కి దూరమయ్యానంటారు.. అయినా నిరంతరం అటెన్షన్ తనవైపు తిప్పుకోవడానికి విజయసాయిరెడ్డి ఏదో ఒక పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు.. వ్యవసాయం చేసుకుంటానని రాజ్యసభ సభత్వాన్ని వదులుకుని వెళ్లిపోయిన ఆయన.. పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వడానికి ప్లేట్ మారుస్తున్నారా?.. లేకపోతే వైసీపీలో తనను ఇబ్బంది పెట్టిన వారిపై రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా? అంత చేసి ఎవరినో ఇరికించబోయి.. ఆయనే ఇరుక్కుంటున్నారా? .. అసలు విజయసాయిరెడ్డి స్కెచ్ ఏంటి?
రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని వైసీపీకి దూరమైన విజయసాయి
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న నేత.. వైసీపీ మాజీ ఎంపీ వై.విజయసాయిరెడ్డి.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా అందరికీ సుపరిచితులైన ఆ ఆడిటర్ .. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని.. ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వం ఇంకా మూడేళ్లకు పైగా ఉండగానే ఆయన పదవికి, వైసీపీకి రాజీనామా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఆ క్రమంలో కాకినాడ సీపోర్టు కేసులో కూడా ఏ2 గానే ఫైల్ అయ్యారు. దీంతో తాను రాజకీయాల్లో ఉన్నా .. బయట ఉన్నా తనకు ఏ2 మాత్రం కామన్‌గా మారిపోయిందనుకున్నారో.. లేక పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ చేద్దామనుకుంటున్నారో స్పష్టత లేదు కానీ కాకినాడు పోర్టు కేసు విచారణ మొదలైన నాటి నుంచి పొలిటికల్ అటెన్షన్‌ని మాత్రం తన వైపుకు తిప్పుకుంటున్నారు సాయిరెడ్డి.
కాకినాడ సీపోర్టు కేసులో ఏ2 నిందితుడు
గతంలో వైసీపీలో అన్నీతానై చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా అటు మీడియాతో పాటు పొలిటికల్‌గా అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకోవడనికి తెగ తాపత్రయ పడిపోతున్నారు. గత నెలలో కాకినాడ సీపోర్టు కేసులో సీఐడీ విచారణకు వెళ్లిన సాయిరెడ్డి.. విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లిక్కర్ స్కాంపై హాట్ కామెంట్లు చేశారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే చాలా విషయాలు చెబుతానంటూ ఎవరికీ తెలియని రాజ్ కేసిరెడ్డిని ఆ కేసులో ఫోకస్ చేశారు. అక్కడ మొదలైంది లిక్కర్ స్కాం కధ.. ఆయన మాటలతో ప్రభుత్వానికి కూడా ఓ అస్త్రం లభించిందని అంటున్నారు. అక్కడి నుంచి రకరకాల ట్విస్ట్ ల మధ్య కేసు విచారణ షురూ అయ్యింది.. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అని విజయసాయిరెడ్డి పేర్కొన్న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అవ్వడంతో తేనె తుట్టు కదిలింది.
పోర్ట్ కేసులో విక్రాంత్ రెడ్డి పాత్రపై ఆరోపణలు
అంతేకాక కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని చేసిందంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే చేశారని విజయసాయి చెప్పుకొచ్చారు.. పోర్టు వాటాల స్వాధీనానికి సంబంధించి మొత్తం చేసింది విక్రాంత్‌రెడ్డే అని బాంబు పేల్చారు. ఆ తర్వాత టాపిక్ ను కాకినాడ పోర్టు అంశం నుంచి లిక్కర్ స్కాం వైపు డైవర్ట్ చేశారు సాయిరెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందు ఫోకస్ చేసింది లిక్కర్ స్కాంపైనే.. అయితే దాన్ని ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్దం కాక సర్కారు సతమతమవుతున్న సమయంలో అవసరం లేకపోయినా విజయసాయరెడ్డి దారి చూపించారంటున్నారు. ఏపీ లిక్కర్ స్కాంలో సూత్రధారి.. పాత్రధారి అంటూ జగన్ సన్నిహితుడైన కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరును హైలెట్ చేశరు. భవిష్యత్ లో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
విచారణ తర్వాత రాజ్ కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు
లిక్కర్ స్కాంపై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో సాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో విచారణ కి హాజరయ్యారు. ఈ కేసులో అంతవరకు నిందితుడిగా భావించిన సాయిరెడ్డిని సాక్షిగా పరిగణించాలని సిట్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగింది. ఈఈనెల 18న లిక్కర్ స్కాంపై విచారణకు హాజరైన సాయిరెడ్డి.. యధావిధిగా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మద్యం స్కాం మొత్తాన్ని కేసిరెడ్డి రాజ్ రెడ్డి నడిపించారని మరోసారి కుండ బద్ధలు కొట్టారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మీటింగ్స్, కేసిరెడ్డి వ్యవహార శైలిపై సంచలన విషయాలు వెల్లడించారు.
రూ.100 కోట్లు అప్పు ఇప్పించానని వెల్లడి
అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి ఉన్నారన్న సాయిరెడ్డి ఆ ఇద్దరు వ్యాపారం చేసుకుంటామంటే అరబిందో కంపెనీ నుంచి తాను 100 కోట్ల రూపయలు అప్పు ఇప్పించానని తెలిపారు. ఇందులో అదాన్ డిస్టలరీస్ కి 60 కోట్లు, డికాక్ సంస్థకు 40 కోట్లు అరబిందో శరత్ చంద్రారెడ్డి ద్వారా సమకూర్చారన్నారు.. అదాన్ డిస్టలరీస్ కి ఇచ్చిన 60 కోట్లు వడ్డీతో కలిసి తిరిగి ఇచ్చేశారని.. డికాక్ తీసుకున్న 40 కోట్లలో అసలు మాత్రమే రిటర్న్ వచ్చిందని.. దీనిమీద ఇంకా వివాదం కొనసాగుతోందన్నారు..అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూనే వారికి వ్యాపారం చేసుకోవటానికి 100 కోట్లు అప్పు ఇప్పించానని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. అయితే సాక్షిగా విచారణకు పిలిచారు అనుకుంటున్న తరుణంలో షడన్ గా సాయి రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
లిక్కర్ స్కాంలో ఎవరినో ఇరికంచబోయి తానే ఇరుక్కుంటున్నారా?
సాయిరెడ్డి కామెంట్స్ నిశితంగా పరిశీలిస్తున్న పొలిటికల్ పండిట్స్ వర్షన్ మాత్రం భిన్నంగా వినిపిస్తోంది. సాయిరెడ్డి లిక్కర్ స్కాంలో ఎవరినో ఇరికంచబోయి తానే ఇరుక్కుంటున్నారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొదట కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు వచ్చిన సాయిరెడ్డి.. ఆ సమయంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి తన అల్లుడని.. వారితో తనకు అసలు వ్యాపార సంబందాలు లేవని చెప్పారు.. కనీసం వారిని వారి సంస్ధలో ఓ ఉద్యోగం కోసం కూడా అడగలేదన్నారు. ఆ తర్వాత లిక్కర్ వ్యవహారానికి వచ్చే సరికి వారి ద్వారానే వ్యాపారం చేసుకోవటానికి వంద కోట్లు ఇప్పించానని తానే చెప్పుకొచ్చారు.
లిక్కర్ వ్యవహారంతో సంబంధం లేకుంటే అప్పు ఎందుకు ఇప్పించారు?
అరబిందో సంస్దతో తనకు ఆర్దిక లావాదేవీలు ఏమీ లేవు.. కేవలం బంధుత్వం మాత్రమే ఉందన్న సాయిరెడ్డి… అసలు ఆయనకు ఏ సంబంధం లేకపోతే ఎందుకు వంద కోట్లు ఇప్పించారు?.. ఎవరు అడక్కపోయినా లిక్కర్ స్కాం గురించి మీడియా ముందు ఎందుకు మాట్లాడారు?.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన హైదరాబాద్‌లో ఓసారి.. విజయవాడలో మరోసారి తన నివాసంలో లిక్కర్ పాలసీపై ఏ అధికారంతో చర్చించారు? కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మొదట జగన్‌కి తానే పరిచయం చేశానని చెప్పిన ఆయన ఆ తర్వాత అరబిందో ద్వారా 100 కోట్లు ఎందుకు ఇప్పించారు? లిక్కర్ వ్యవహారంతో ఏ సంబందం లేకుంటే వాళ్లకు అప్పు ఇప్పించాల్సిన అవసరం ఏంటి?.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పొమ్మనకుండా పొగ పెట్టిన వారిని టార్గెట్ చేయాలనుకుంటున్నారా?
మొత్తం మీద ఈ వ్యవహారంలో సాయిరెడ్డి టార్గెట్ ఏంటి పార్టీ నుంచి తనకు పొమ్మనకుండా పొగ పెట్టిన వారిని టార్గెట్ చేయలనుకుంటున్నారా?.. పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తున్న ఆయన తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకోవడానికి ఇదంతా చేస్తున్నారా?.. సాయిరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి?.. లిక్కర్ కేసులో ఇంకా ఎవరినైనా ఆయన ఇరికిస్తారా.. ఆయనే ఇరుక్కుంటారా?.. అసలు ఆ కేసు ఏ టర్న్ తీసుకుంటుందనేది ఇప్పుడందరి చర్చల్లో నలుగుతోంది.