AP BJP: ఏపీ బీజేపీలో పదవులపై క్లారిటీ వస్తోందా? ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఎన్నిక కావడంతో, కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరు? పాత వారికి పార్టీ హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందా? కొత్తవారిని ఆ పదవిలో కూర్చోబెడుతుందా? బీజేపీలో ఏ ఇద్దరు నేతలు సమావేశమైనా ఇదే చర్చ. ఈ నెల చివరి నాటికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై క్లారిటీ రానుందా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.
కొత్త అధ్యక్షుడి రేసులో
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీ హైకమాండ్‌కు కత్తి మీద సాముగా మారింది. తెలంగాణ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. ఏపీ విషయానికొస్తే దాదాపు అరడజను మంది నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో పాత నేతలకే అధ్యక్షుడి పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయట.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తోపాటు మరో నలుగురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి మాధవ్, కోస్తా నుంచి సత్యనారాయణ, నెల్లూరు జిల్లా నుంచి సురేశ్‌రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ కేంద్రమంత్రి లాబీయింగ్?
విష్ణువర్ధన్ రెడ్డి తెర వెనుక లాబీయింగ్ చేస్తున్నారట. తెలంగాణకు చెందిన ఓ కేంద్ర మంత్రి ఆయన సిఫారసు చేసినట్లు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. అందులో నిజమెంత తెలీదుగానీ రాయలసీమ వారికే పార్టీ పగ్గాలు ఇవ్వాలన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. దాదాపుగా విష్ణువర్థన్ రెడ్డికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ బీజేపీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
ALSO READ: అవినాష్‌కు ‘ఫ్యామిలీ’ కష్టాలు
మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాదిరిగా ఈయన కూడా టీడీపీకి రెబెల్ అనే వాదన ఏపీలో ఉంది. చాలాసార్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడిన సందర్భాలు లేకపోలేదు. మొన్నటికి మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఏపీలో ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి కావాలని డిమాండ్ చేసిన వ్యక్తుల్లో ఈయన మొదట ఉంటారు.
వైసీపీ అనుచరుడిగా పేరు?
డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే బీజేపీకి సీఎం పదవి ఇవ్వాలని మీడియా ముందు కామెంట్స్ చేయడం ఆయనకే చెల్లింది. 2014 మాదిరిగా పరిస్థితులు ఏపీలో లేదని, మారాయని వ్యాఖ్యానించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన్ని వైసీపీకి వీరవిధేయుడిగా కొందరు టీడీపీ నేతలు సమయం వచ్చినప్పుడు చెబుతారు. గడిచిన ఐదేళ్లు ఆయన మాటలు వైసీపీ మద్దతుగా ఇచ్చినట్టు ఉన్నాయని కొందరన్నారు కూడా.
పవన్ ఓపీనియన్ మాటేంటి?
సోము వీర్రాజుకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వగా లేనిది, విష్ణువర్థన్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే తప్పేముందని అంటున్నవాళ్లూ ఆ పార్టీలో లేకపోలేదు. ఎలాగూ ఆయన ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారని అంటున్నారు. మరి బీజేపీ హైకమాండ్ మదిలో ఏముంది?
ఒకవేళ కొత్త బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికిస్తే బాగుంటుదని జనసేన చీఫ్ పవన్ నుంచి ఓపీనియన తీసుకునే అవకాశముందన్నది కొందరి మాట. పవన్ మాట కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. మొత్తానికి కొత్త ఏపీ అధ్యక్షుడు ఎవరు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.