Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో మహిళ డెడ్‌బాడీ. అది కూడా న్యూడ్‌గా. రెండురోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను కలచివేసిన సంఘటన. భర్త, అత్తింటి వేధింపులే తన కూతురు చావుకు కారణమంటోంది మృతురాలి తల్లి. తమకేం పాపం తెలీదనేది భర్త వెర్షన్. చనిపోయిన శ్వేత ఒంటిపై బట్టలు ఎందుకు లేవు? ఇది ఆత్మహత్యా? లేదంటే, ఎవరైనా ఏమైనా చేశారా? అసలే విశాఖ బీచ్‌లో గంజాయి బ్యాచ్‌లు పెరిగిపోయాయి.. వాళ్లెవరైనా? ఇలా పోలీసులకు సవాల్‌గా నిలిచింది కేసు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది.
రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రాథమికంగా ఓ క్లారిటీకి వచ్చారు. శ్వేతది ఆత్మహత్యేనని తేల్చారు. కాకపోతే, భర్త, అత్తామామలు, ఆడపడుచు, అడపడుచు భర్తల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారని గుర్తించారు. వారందరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. శ్వేత మరణంపై ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు వివరాలను విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ వివరించారు.
90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉందని, ఆ భూమి తన పేరుపై మార్చాలని భర్త ఇబ్బంది పెట్టాడన్నారు. కుటుంబ కలహాలతో శ్వేత మనస్తాపం చెందిందని తెలిపారు.
శ్వేతా ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని చెప్పారు. శ్వేత భర్త, అత్తా, మామ, ఆడపడుచు భర్తను అరెస్ట్ చేశామన్నారు. శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు విశాఖ సీపీ.
“శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్వేతకు ఏడాది క్రితం గాజువాకకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మణికంఠతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. శ్వేత గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి వెళ్లినప్పుడు ఆమె తల్లి ఎదుటే భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. శ్వేతపై మణికంఠ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడే ఆత్మహత్యకు ప్రయత్నించగా తల్లి కాపాడింది. 15 రోజుల క్రితం ఆఫీస్ పని మీద మణికంఠ హైదరాబాద్ వెళ్లాడు. మంగళవారం అత్తతో శ్వేతకు గొడవ జరిగింది. రాత్రి 8.20 నుంచి 8.32 వరకు భర్తతో ఫోన్‌లో మాట్లాడింది. సూసైడ్ నోట్‌ను గదిలో పెట్టి ఇంటి నుంచి వెళ్లి పోయింది”.. అని విశాఖ సీపీ వెల్లడించారు.
ఇక, బీచ్‌లో శ్వేత డెడ్‌బాడీ ఇసుకలో కూరుకుపోవడం, ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉండటంపై పలు అనుమానాలు రాగా.. వాటిపై క్లారిటీ ఇచ్చారు సీపీ. సముద్రం ఆటుపోట్ల వల్లే మృతదేహం ఆ ప్రాంతానికి కొట్టుకొచ్చిందని తెలిపారు.
పర్యావరణ నిపుణులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. శ్వేత లూజ్ డ్రెస్ వేసుకుందని.. అలల తాకిడికే శ్వేత ఒంటిపై దుస్తులు కొట్టుకుపోయాయని చెప్పారు. గతంలో ఓ రెండు డెడ్‌బాడీల విషయంలోనూ ఇలానే జరిగిందని ఆ ఫోటోలను మీడియాకు చూపించారు. శ్వేత ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.