Vizianagaram Tragedy: పచ్చటి పందరి.. గడపకు పసుపు.. గుమ్మానికి మామిడి తోరణం.. ఇంటి ముందు పెళ్లి భాజాలు.. నిన్నటి వరకు ఆ ఇంట్లో పెళ్లి సందడి.. ఈరోజు పరిస్థితి అలా లేదు. క్షణాల్లో ఆ సందడి అంతా ఆవిరి అయిపోయింది. ఆ ఇంటి తల్లిని కోల్పోయింది. లాలించి పెంచిన కూతురు వెళ్లిపోతుందని దిగులు పెట్టుకుందేమో.. ఇక తన కూతురు పరాయిదైపోతుందని బెంగపెట్టుకుందేమో.. తన బాధను ఎవరితో పంచుకోకుండా మనసులోనే దాచుకుందేమే.. ఆ తల్లి గుండె తట్టుకోలేక పోయింది. ఒక్కసారిగా ఆగిపోయింది. పెళ్లి పందిట్లోనే కుప్పకూలిపోయింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఆ తల్లి.
పెళ్లిమండపం అంతా సందడిగా ఉంది. మేళతాళాల మధ్య అంగరంగ వైభవంగా కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. పెళ్లింట్లో అందరూ సరదాకా ఒకరినొకరు ఆటపట్టించుకుంటున్నారు. భోజనాలు చేస్తున్నారు. వచ్చే వాళ్లు.. పోయే వాళ్లతో మండపం అంతా సందడిగా ఉంది. ఇంతలోనే అనుకోని విషాదం. అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది. ఏం జరుగుతుందో అని తేరుకునే లోపే ఏంతా జరిగిపోయింది.
ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాతబగ్గాంలో చోటు చేసుకుంది. మరి కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెళ్లి కూతురు తల్లి గుండె పోటుతో మృతి చెందింది.
పాతబగ్గాంలో పప్పల పైడమ్మ తన కూతురితో జీవనం సాగిస్తుంది. రెండేళ్ల క్రితం తన భర్త అనారోగ్యంతో చనిపోగా.. ఇంటి బాధ్యతల్ని తానే తీసుకుంది. ఆమె కుమార్తెకు పెళ్లి కుదిరించి పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసింది. కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. ఆమె గుండె పోటుతో మృతి చెందింది.
అప్పటివరకు మండపం అంతా కలియ తిరుగుతూ.. అన్ని చేసిన తన తల్లి ఇక లేదనే వార్త విని ఆ బిడ్డ మనసు తల్లడిల్లిపోయింది. దగ్గరుండి అత్తారింటికి సాగనంపుతుంది అనుకున్న అమ్మ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసిన ఆ అమ్మాయి.. నాకు ఇంక ఎవరున్నారమ్మా అంటూ.. గుండెపగిలేల రోధించిన తీరు అక్కడి వాళ్లను కంటతడిపెట్టేలా చేసింది.
Also Read: మలేషియాలో తెలంగాణ వాసి మృతి, కడసారి చూపుకోసం కూతుళ్ల ఎదురుచూపు
నిన్నటి వరకు ఆనందంగా, సందడిగా ఉన్నా ఆ వీధి ఒక్కసారిగా మూగబోయింది. పిల్లలకు తల్లితో ఉండే అనుభందం ఎప్పటికీ ప్రత్యేకమే. తన ప్రతి ఆనందంలో తల్లి ఉండాలనుకుంటారు. అలానే అనుకుంది ఆ పెళ్లికూతురు. కానీ తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లుగా.. ఆనందాన్ని ఆవిరి చేసాడు ఆ దేవుడు. తల్లిదండ్రుల్లేని ఆ అమ్మాయికి భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.