నారా లోకేష్ ఇటీవల కాలంలో తొలిసారిగా సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడారు. ఏ సినిమాలో అయితే మహిళల్ని కించపరిచే సన్నివేశాలు కానీ, డైలాగ్ లు కానీ ఉంటాయో వాటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సన్నివేశాలు తొలగించాకే వాటి రిలీజ్ కి అనుమతి లభించేలా ప్రత్యేక చట్టం చేయాలన్నారు. ఈమేరకు తాను సీఎం చంద్రబాబుని అభ్యర్థిస్తున్నట్టు తెలిపారు లోకేష్. మహిళల్ని కించపరిచేలా సినిమాలు, వెబ్ సిరీస్ లు తీయొద్దని ఆయన సూచించారు.
ఆ మాటలు వద్దు..
చేతులకు గాజులు వేసుకున్నావా, అమ్మాయిలా ఏడవకు.. అంటూ కొంతమంది సందర్భం లేకపోయినా మహిళలతో పోలుస్తూ చిన్నచూపు చూసే ప్రయత్నం చేస్తారు. అలాంటి మాటలు ఇకపై వాడొద్దు అని సూచించారు మంత్రి నారా లోకేష్. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు, తాజాగా మరోసారి ఆయన అలాంటి వ్యాఖ్యలపై కీలక సూచనలు చేశారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానిస్తే ఆమె కోలుకోవడానికి 3నెలలు సమయం పట్టిందన్నారు లోకేష్. మార్పు ముందు మన ఇంటి నుండే మొదలవ్వాలని, మహిళలను కించపరిచే మాటలు ఎవరైనా మాట్లాడితే ఇంకోసారి మాట్లాడొద్దని గట్టిగా చెప్పాలని సూచించారు. అలా మాట్లాడితే అన్న లోకేష్ తోలుతీస్తాడని చెప్పండి అన్నారు.
చట్టాలతో భద్రత రాదు..
మహిళల భద్రత గురించి అందరూ మాట్లాడతారని, కానీ.. కేవలం చట్టాలు చేయడం వల్ల భద్రత రాదు అని, ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పారు లోకేష్. విద్యార్థి దశ నుండి మహిళల్ని గౌరవించడం నేర్పాలన్నారు. అందుకే చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు పిల్లలకు ఇస్తున్నామని తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో ఇంటిపనుల ఫోటోలు కేవలం మహిళలు చేస్తున్నట్టే ఉండేవని, తమ హయాంలో పురుషులు కూడా మహిళలతో కలసి ఆ బాధ్యత పంచుకుంటున్నట్టుగా చెరో సగం ఉండేలా చేశామన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పిల్లలతో తల్లికి వందనం చేయించామని తెలిపారు లోకేష్.
తల్లి, భార్య గురించి..
ఆవకాయ పెట్టాలన్నా, అంతరిక్షం వెళ్లాలన్నా మహిళలే సమర్థులని అన్నారు లోకేష్. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని, దానికి ప్రత్యక్ష ఉదాహరణ తమ ఇల్లేనని చెప్పారు నారా లోకేష్. మొదట్లో తన తల్లి భువనేశ్వరి ఆఫీస్ కు వెళ్ళడానికి భయపడేవారని, కొన్ని సార్లు ఆఫీస్ వరకూ వెళ్లి బయటే కార్లో కూర్చున్న రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కట్ చేస్తే ఆమె హెరిటేజ్ కంపెనీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారన్నారు. ఈరోజు 5వేల కోట్ల విలువైన కంపెనీ నడిపిస్తోందని, ఎన్టీఆర్ ట్రస్ట్ ను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తోందని చెప్పారు లోకేష్. తన శ్రీమతి బ్రాహ్మణి గురించి చెబుతూ లోకేష్ సిగ్గుపడిపోయారు. బ్రాహ్మణి స్టాన్ ఫర్డ్ లో చదివారని, తన క్రెడిట్ కార్డు బిల్లు కూడా ఈరోజు ఆమే కడుతుంటారని చెప్పారు. ఇంటి విషయాలన్నీ తనే చూసుకుంటుందన్నారు. బసవతారకం డైరక్టర్ గా నిరుపేద కుటుంబాలకు బ్రాహ్మణి సహాయం అందిస్తోందన్నారు లోకేష్. ప్రోత్సాహం అందిస్తే మహిళలు మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారన్నారు. అలాంటి మహిళలను మనం గౌరవించాలని, భావితరాలకు కూడా ఆ సంస్కారాన్ని అందించాలని చెప్పారు.