Karimnagar news: పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు. తల్లిని చూసుకున్నవాడు ఎప్పుడూ కష్టాల్లో పడడు అని. కానీ కరీంనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ మాటకు పూర్తి విరుద్ధం. నవమాసాలు మోసి, కని, పెంచి, పెద్ద చేసిన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు, కేవలం వృద్ధాప్య పెన్షన్ కోసం తల్లి బాగోగులు మరిచి, పంచాయతీ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. తల్లి పెన్షన్ డబ్బు ఎవరికో అన్న వాదన, చివరకు గ్రామంలో పెద్ద చర్చగా మారి, పోలీసుల వరకు వెళ్లింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తల్లి ప్రేమ గొప్పతనం, కొడుకుల ఆలోచన స్థితి రెండింటినీ బహిర్గతం చేశాయి.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన వెంగల లక్ష్మి జీవిత కథ ఏ ఒక్కరికైనా తలచుకుంటే కన్నీళ్లు రావాల్సిందే. ఇరవై ఏళ్ల క్రితం భర్త మల్లయ్యను కోల్పోయిన లక్ష్మి, చిన్న పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ కష్టకాలంలోనే వారిని పెంచి పెద్ద చేసి, చదివించి, వివాహాలు జరిపి, తన చేతిలో ఉన్న ఆస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చింది.
తల్లి బాగోగులు చూసుకోవడానికే ముగ్గురు కుమారులు ఒక అంగీకారానికి వచ్చారు. నెలలో 10 రోజులు ఒక్కొక్కరి వద్ద ఉంటూ చూసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ అంగీకారం ప్రకారం లక్ష్మి, రెండో కుమారుడు రాజయ్య వద్ద 10 రోజులు గడిపింది. 10 రోజులు పూర్తయ్యాక, పెద్ద కుమారుడు రాజ కొమురయ్య వద్దకు తీసుకెళ్లారు.
కానీ ఇక్కడి నుంచే పెన్షన్ డబ్బు వివాదం మంట రేపింది. తల్లికి వచ్చే వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని ఎవరు పొందాలన్న తగాదా, కుటుంబంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. చివరికి, పెద్ద కుమారుడు పెన్షన్ డబ్బు వివాదం పరిష్కారమయ్యే వరకు తల్లిని నేను ఇంటికి తీసుకెళ్లను అంటూ, తల్లిని పంచాయతీ కార్యాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు.
గ్రామస్థులు ఈ ఘటన చూసి షాక్ అయ్యారు. తల్లి వయసులో బాగోగులు చూసుకోవాల్సిన కొడుకులు ఇలా ప్రవర్తించడం, అందరి మనసునూ కలచివేసింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, పెద్ద కుమారుడు రాజకోమురయ్యతో మాట్లాడి, ఇలాంటి వ్యవహారం తగదని, తల్లిని ఇంటికి తీసుకెళ్లాలని కౌన్సిలింగ్ ఇచ్చారు.
Also Read: Bihar gang: హైదరాబాద్‌లో బీహార్ గ్యాంగ్ అలర్ట్.. చర్లపల్లిలో మూడు పిస్టల్స్ స్వాధీనం!
కౌన్సిలింగ్ తరువాత, పంచాయతీ పెద్దలు కూడా జోక్యం చేసుకుని, డబ్బు తర్వాత, తల్లి ముందు అనే మాటను గుర్తు చేశారు. తల్లి సుఖదుఖాలలో తోడుగా ఉండడమే నిజమైన కుమార ధర్మమని వివరించారు. చివరికి కొడుకు తల్లిని ఇంటికి తీసుకెళ్లడానికి అంగీకరించాడు. ఈ ఘటన గ్రామంలో, జిల్లాలో పెద్ద చర్చగా మారింది. కన్నతల్లి.. ఎప్పుడూ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కానీ పిల్లలు డబ్బు కోసం తల్లిని మరిచిపోవడం తగునా అని పలువురు వాపోయారు.
తల్లి గొప్పతనం
తల్లి అంటే కేవలం ఒక పదం కాదు.. అది త్యాగానికి, ప్రేమకు ప్రతిరూపం. వెంగల లక్ష్మి లాంటి తల్లులు జీవితమంతా పిల్లల కోసం కష్టపడతారు. పగలు పొలం పనులు, రాత్రి ఇంటి పనులు చేసి, పిల్లలకు అన్నం పెట్టి, చదువు నేర్పించి, కష్టాలను ఎదుర్కొంటారు. కానీ చివరికి వారిని పెంచిన పిల్లలే ఇలా ప్రవర్తిస్తే, అది సమాజానికి సిగ్గు తెచ్చే విషయం.
కొడుకుల స్థితి
ముగ్గురు కొడుకులు కూడా తల్లిని చూసుకోవడంలో డబ్బు ప్రాధాన్యం ఇస్తూ, మనసు ప్రాధాన్యం మరిచారు. పెన్షన్ కోసం తల్లిని పంచాయతీ వద్ద వదిలేయడం అంటే, మనిషిగా విలువలు కోల్పోవడమే అని పెద్దలు విమర్శిస్తున్నారు. ఈ సంఘటన కేవలం ఒక కుటుంబం కథ మాత్రమే కాదు.. ఇది సమాజానికి ఒక హెచ్చరిక. వృద్ధుల పట్ల మన బాధ్యత, తల్లిదండ్రుల పట్ల మన గౌరవం కేవలం మాటల్లో కాదు, ఆచరణలో ఉండాలి. డబ్బు కోసం మనసు మారిపోవడం కన్నా, తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందడం ఎంతో గొప్పది.