Posani Krishna Murali : “నేను ఇలానే ఉంటా, నేను నాలానే ఉంటా… ఐయామ్ వేరీ స్ట్రాంగ్”. “నన్ను ఎవరూ మార్చలేరు. మహా అయితే ఏం చేస్తారు చంపేస్తారు. అంతేగా.. నేను రెడీ” “నా ప్రాణాలు పోయే వరకు జగన్ వెంటే ఉంటా” “నాకు రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం, కోట్ల మంది కోసం నేను విమర్శలు ఎదుర్కొన్నా, వెనక్కి తగ్గను”… ఇవీ ఒకప్పుడు ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ(Posani Krishna Murali) మాటలు. ప్రత్యేకంగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఇలాంటి డైలాగులు ఎన్నో పేల్చారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే మనిషిని కాదని ప్రకటించేశారు. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, వ్యక్తిగతంగానూ పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. అందుకే.. తన మాటల్ని మరిచిపోయి, ఇంత వరకు కనిపించని కొత్త తరహా పోసానిని బయటకు తీశారు.
తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన పోసాని కృష్ణమురళి.. “మీకు దండం పెడతా, నాకు రాజకీయాలు(politics) సరిపోవు”. “నేను జీవితంలో ఇకపై రాజకీయాలు మాట్లాడను. నన్ను వదిలిపెట్టండి”. “ప్రస్తుతం నా పిల్లలు, కుటుంబం గురించి ఆలోచిస్తున్నా”… అంటూ ప్రకటించేశారు. దాంతో.. ఆయన అభిమానులు, ఆయనలోని ఫైర్ బ్రాండ్ పోసానిని చూసిన వాళ్లు… ఇదేంటి మన పోసాని ఇలా మారిపోయారు అనుకోకమానరు. అంతే కాదండోయ్.. నిన్నటి ప్రెస్ మీట్ విన్న, చూసిన వాళ్లకు పోసాని కృష్ణ మురళీలో తెలియని భయం సైతం స్పష్టంగానే కనిపించింది. ఈ పరిస్థితులకు కారణాలు ఏంటా అని ప్రస్తుతం నెట్టింట్లో గట్టిగానే చర్చ నడుస్తోంది.
అప్పుడు హీరో.. మరిప్పుడు
తాను 11 ఏళ్లుగా జగన్ ను ఫాలో అవుతున్నాను అని చెప్పుకున్న పోసాని కృష్ణ మురళీ.. జగన్(YS Jagan) వంటి నిజాయితీ కలిగిన, నిఖార్సైన రాజకీయ నేతను చూడలేదంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. తాను జగన్ వంటి నేతకు సైనికుడిలా ముందుంటా అంటూ వ్యాఖ్యానించారు. 2019 నుంచి వైసీపీ కి గట్టి మద్దతుదారుగా ఉన్న పోసాని, ఆ తర్వాతా పార్టీకి అవసరమైన సందర్భాల్లో బయటకు వచ్చి గట్టిగానే మాట్లాడారు. ముఖ్యంగా.. సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద అదే రంగానికి చెందిన పోసాని విమర్శలకు అంతే లేదు. పాలనాపరమైన సమస్యలపై పవన్ ప్రశ్నిస్తే.. అతనిపై వ్యక్తిగత దాడులు(Personal Acttacks) చేసిన సందర్భాలున్నాయి. మరీ ముఖ్యంగా.. మొన్నటి ఎన్నికల్లో అయితే.. అరే, ఒరేయ్, సన్నాసి అంటూ.. విరుచుకుపడ్డారు. దాంతో.. ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో వాటిపైనా ప్రత్యేక ప్రెస్ మీట్లు పెట్టి మెగా హీరోల (Mega Heroes)పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్, నాగబాబే.. అభిమానుల్ని రెచ్చగొట్టి తనపై దాడులకు పంపిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. టికెట్ల రేట్ల విషయంలోనూ ఎంట్రీ ఇచ్చిన పోసాని.. ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచారు.
చంద్రబాబు ఫేక్ సీఎం
ఇక చంద్రబాబు(Chandrababu) పై పోసాని విమర్శలకు అదుపే లేదు. సందర్భమేదైనా పోసాని కామెంట్లు కచ్చితంగా కనిపించేవి. సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న పోసాని.. ఎందుకు అంతగా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారో అర్థం కాని స్థాయిలో రాజకీయ విమర్శలు చేశారు. రాజశేఖర్ రెడ్డి(YS Rajashekhar Reddy)ని , జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తే వారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. చంద్రబాబుపై పరిమితులకు మించి పోసాని కామెంట్లు చేశారు. అసలు చంద్రబాబు రాజకీయ నాయకుడే కాదని అన్నారు. జగన్ లా రాజకీయాలు చేసిన వ్యక్తి కాదని.. ఎన్టీఆర్(Seniour NTR) ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారంటూ హాట్ కామెంట్లు చేశారు. చంద్రబాబు దొడ్డిదారిన సీఎం అయ్యారని, ఆయన ఫేక్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. తనకు ఎలాంటి పదవి వద్దన్న పోసాని.. ఎన్నికల్లో వైసీపీ(YCP)కి తిరుగులేదంటూ ప్రకటించేశారు.
ఇలా.. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు.. జగన్ ను విమర్శించిన అందరిపై పోసాని మాటలు తూటాలు పేల్చారు. తనకు పదవి వద్దూ అంటూనే.. రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల్ని చేజిక్కించుకున్నారు. అన్ని రకాలుగా జగన్ ను మెప్పించిన పోసాని కృష్ణ మురళీకి.. 2022 నవంబర్ లో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్(APFCC) పదవిని జగన్ బహుమతిగా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడుగా ఉన్న హాస్య నటుడు అలీ(Actor Ali)ని సైతం అప్పుడే ఎలక్ట్రానికి మీడియా సలహాదారుగా జగన్ నియమించారు. అలా.. పదవిలోనూ కొన్నాళ్లు ఉన్న పోసాని, ఇప్పుడు.. తన రూట్ మార్చేశారు. ఏపీలో జగన్ అధికారం కోల్పోవడంతో అసలు రాజకీయ క్రీడ ఎలా ఉంటుందో అర్థం అయ్యింది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా వివిధ చోట్ల కేసులు నమోదు కావడం, పవన్ కళ్యాణ్ పై అసభ్య, పరుష పదజాలాలు వినియోగించారనే ఆరోపణలతో ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. దాంతో.. అసలు విషయం బోధపడిన పోసాని, తనకు రాజకీయాలు వద్దని ప్రకటించారు.
అప్పుడలా.. ఇప్పుడిలా
అంతవరకు బాగానే ఉన్నా.. తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదంటూ వింత మాటలు మాట్లాడారు. తాను వైసీపీ కి సైనికుడిని అని ప్రకటించిన పోసాని.. ఇప్పుడు అసలు సభ్యత్వమే లేదనడం వింతకు పరాకాష్ట. అంతే కాదు.. చంద్రబాబు అసలు నాయకుడే కాదన్న ఈ నటుడు.. గతంలో తాను చంద్రబాబును పొగిడినన్ని సార్లు మరెవరూ పొగడలేదు, కావాలంటే ఆయన్నే అడగండి అంటూ వింత వాదన వినిపించారు. ఇలా.. ఒకటా, రెండా.. పోసాని రాజకీయ సన్యాసం గురించి మాట్లాడిన సందర్భంలో ఎన్నో మాటలు గతానికి భిన్నంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. మన పోసాని ఇతనేనా అనేలా.. కాస్త తగ్గి, వినయంగా, విధేయతతో విషయాన్ని చెప్పుకుంటూపోయారు. ఈ మహత్తు అంతా.. పోలీసు కేసుల్లోనే ఉంది అన్నది చూస్తు్న్న వారి మాట.
ప్రస్తుతం ఏపీలో వైసీపీకి కష్టకాలం నడుస్తోంది. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని.. రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్లు చేసిన వాళ్లంతా ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితులు. వైసీపీ అధినేత జగన్ వారికి మద్ధతుగా ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ సోషల్ వారియర్ల కోసం పోరాడే వాళ్లు కనిపించడం లేదు. అసలు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులకే ఎసరు వస్తుంటే.. వాళ్లు ఎవరికి మద్ధతుగా నిలిచే పరిస్థితులు కనిపించడం లేదు.
ఎటు మాట్లాడినా ఇబ్బందే..
ఏపీ రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. తిరుపతి లడ్డూ వ్యవహారం(Tirumala Laddu Issue) కానీ, సినీనటి పై పోలీసుల వేధింపుల కేసు కానీ, ప్రకాశం బ్యారేజ్(Prakasham Barriage) ని బోట్లు ఢీ కొట్టిన ఘటన కానీ… వీటిలో వేటిపై కామెంట్లు చేసినా, ప్రజల్లో ఇంకా చులకన అయ్యే అవకాశాలున్నాయి. వెంకటేశ్వర స్వామి కంటే రాజకీయ నేత ఎక్కువా అనే అపవాదు వచ్చే అవకాశం ఉంది. జత్వాని కేసుపై అయితే.. మహిళా సంఘాలతో తిప్పలు తప్పవు, బోట్ల విషయంలో అయితే.. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ఎక్కువగా అనే అవకాశం ఉందని.. వైసీపీ నాయకులు మాట్లాడలేదు. పైగా.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, ఉపయోగించిన పదాలు సైతం.. ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయం అందరికీ అర్థం అయ్యింది. ఈ నేపథ్యంలోనే.. ఇక ఇలాంటి సోషల్ మీడియా వారియర్ల(YCP Social Media Activists)కు మద్ధతుగా నిలిచేందుకు వైసీపీ నాయకులు వెనకడుగు వేస్తున్నట్లు టాక్.
ఈ మధ్య కాలంలో వైఎస్ షర్మిళ వ్యవహారంలో ఏకంగా తమ నాయకుడు జగన్ కు మద్ధతుగా నిలిచేందుకు ప్రయత్నించిన నేతలకే చివాట్లు తప్పలేదు. అటు.. వైఎస్ఆర్ అభిమానులు నుంచి, మరోవైపు వైఎస్ విజయమ్మ(YS Vijayamma) వైపు నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు నాయకుడికి మద్ధతుగా నిలుస్తుంటేనే.. గుక్కతిప్పుకోనివ్వని విమర్శలు ఎదుర్కొన్న సందర్భంలో ఇలాంటి రాజకీయేతర రంగాలకు చెందిన వారికి మద్ధతుగా నిలిచే అవకాశాలు అసలు కనిపించడం లేదు. గతంలో శ్రీరెడ్డి(Sri Reddy), బోరుగడ్డ అనిల్(Borugadda Anil), పోసాని కృష్ణ మురళీ సహా.. అనేక మంది వైసీపీ కి అనుకూలంగా పనిచేసినా, వారి సేవల్ని బాగానే పొందినా.. ఇప్పుడు మాత్రం వారి వెంట నడిచేందుకు వైసీపీ నాయకత్వం సుముఖంగా లేదు. ఈ కారణంగానే.. క్రమంగా ఒక్కొక్కరు చెంపలు వేసుకుని.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ కోవలోనే పోసాని సైతం రాజకీయాలకు బైబై చెప్పారు.
Also Read : క్యా సీన్ హై.. పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స.. కారణం అదేనట!
రాజకీయం ఓ ముళ్ల కంప
మిగతా రంగాల పరిస్థితి ఏమో కానీ, రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ వెనక్కి వెళ్లినా.. అక్కడ ఉన్నప్పుడు చేసిన పనులకు పరిణామాలు తప్పక అనుభవించాల్సిందే. ముఖ్యంగా.. రాజకీయ నేతల మనోభావాల్ని దెబ్బతీసిన పోసాని, శ్రీరెడ్డి వంటి వారికి ఇది తప్పని పరిస్థితి. కాబట్టి.. పోసాని కృష్ణమురళి బాధతో, తన వెంట నిలవని వైసీపీ పై కోపంతో పార్టీని, రాజకీయాల్ని వదిలిపెట్టినా.. ఆయనను మాత్రం రాజకీయాలు, వారి తాలుకూ ఫలితాలు వెంటాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్నట్లే పోలీసు కేసులు, విచారణలు.. రిమాండ్లు తప్పకపోవచ్చు.