Nara Lokesh : పాదయాత్ర.. ఏపీలో ఇదొక రాజకీయ సెంటిమెంట్. పాదయాత్ర చేస్తే అధికారం దక్కుతుందని పార్టీల నమ్మకం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్ చేసిన పాదయాత్రలు ఈ సెంటిమెంట్ ను రుజువు చేశాయి. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అదే బాట పట్టారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. లోకేష్ పాదయాత్రను జనవరి 27న ప్రారంభిస్తారు. 400 రోజులపాటు పాదయాత్ర సాగుతుంది. మొత్తం 4 వేల కిలోమీటర్లు నడవాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తన తండ్రి , టీడీపీ అధినేత చంద్రబాబు 7 పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుడతారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తారు.
పార్టీకి ఊపు
ఏ పార్టీ నేతైనా పాదయాత్ర చేపడితే క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది. తమ నియోజకవర్గానికి పాదయాత్ర ఎప్పుడు చేరుకుంటుందా అని ఎదురుచూస్తారు. తమ నాయకుడికి గ్రామాల్లో ఘనస్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఇలా కార్యకర్తల్లో జోష్ పెంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి పాదయాత్ర ఉపయోగపడుతుంది. ఏ నియోజకవర్గాల్లో ఆదరణ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. పార్టీ ఏ ప్రాంతంలో బలంగా ఉంది. ఎక్కడ బలహీనంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. ఏ నేతలకు టిక్కెట్లు ఇవ్వాలో కూడా స్పష్టత వస్తుంది. ఏ వర్గాలు పార్టీని బాగా ఆదరిస్తున్నాయో స్పష్టత వస్తుంది. పార్టీ నాయకుల బలాబలాలను అంచనా వేయడానికి పాదయాత్ర ఉపయోగపడుతుంది. ప్రజలతో నేరుగా మమేకం కావడం వల్ల పాదయాత్ర చేసే నేతకు ఇమేజ్ పెరుగుతుంది. ఈ అంశాలన్నీ పార్టీకి ప్రయోజనం చేకూర్చుతాయనడంలో సందేహం లేదు.
మంగళగిరి నుంచే పోటీ
మరోవైపు పాదయాత్ర షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించిన లోకేష్…అనేక అంశాలపై స్పష్టతనిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఇక్కడ నుంచే తిరిగి పోటీ చేస్తానని స్పష్టతనిచ్చారు. తనని ఓడించేందుకు సీఎం జగన్ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంటే మంగళగిరిలో గెలుపు బాధ్యతను కార్యకర్తలకే అప్పగించారు.
కేసులకు భయపడొద్దు
ఇప్పటికే ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల బాగోగులు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. కేసులకు భయపడొద్దని ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే కార్యకర్తలు అంత బాగా పనిచేసినట్లు అని గతంలో లోకేశ్ చెప్పడం రాజకీయ దుమారం రేపింది. తనపై ఎన్ని ట్రోలింగ్ లు జరుగుతున్నా తగ్గేది లేదని ముందుకుసాగుతున్నారు లోకేశ్.
అధికారం దక్కుతుందా?
ఇప్పుడు పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేయడానికి సిద్ధమైన లోకేష్. టీడీపీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేశారు. దీంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. అప్పుడు వైఎస్ఆర్ సీపీకి అధికార పీఠం దక్కింది. ఇప్పుడు లోకేష్ చేపట్టే పాదయాత్రతో టీడీపీకి అధికారం దక్కుతుందా? సెంటిమెంట్ సూత్రం ఫలిస్తుందా? చూడాలి మరి.