YCP Leader YS Jagan: నన్ను అభిమానించే వారు నా దగ్గరకు వస్తే తప్పేంటి? ఎందుకు ఆంక్షలు పెట్టారని పోలీసులను అడుగుతున్నా అని నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన అనంతరం మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలు రాకుండా రోడ్లు తవ్వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000 మందికి పైగా పోలీసులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అంతేకాకుండా.. లెక్కలేనటు వంటి డీఎస్పీలు ఉన్నారని జగన్ మండిపడ్డారు. వాళ్లందరిని నాకోసం సెక్యూరిటీ కోసం పెట్టలేదని, నా దగ్గర వచ్చేవారిని ఆపడానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను అభిమానించే వారు నా దగ్గరకు వస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. వ్యవస్థను నీరుగార్చే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. పోలీసుల చేతుల మీదుగా కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ అన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అనే పేర్లతో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు.
ప్రసన్నను చంపేందుకు కుట్ర
ఇక విద్య, వైద్యం రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను పునరుద్ఘాటించారు. నాడు–నేడు, గోరుముద్ద వంటి పథకాలు నిలిచిపోయాయని, ఇంగ్లీష్ మీడియం విద్యను గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదవాడికి సరైన వైద్యం అందడం లేదు. ప్రజల జీవితాలతో ఆడుకునే పాలన సాగుతోందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితిపై మాట్లాడిన జగన్, ఇది అర్థం చేసుకోలేనంత తీవ్రమైనదని చెప్పారు. ఒక వ్యక్తి, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిని బెదిరించడం, ఆయన తల్లిని సైతం భయపెట్టడం ప్రజాస్వామ్యంలో ఊహించదగిన విషయమా? ప్రసన్నను చంపేందుకు కుట్ర జరిగింది అనే ఆరోపణలను ఎదుర్కొంటున్న సమయంలో, రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయన్నది స్పష్టమవుతోంది.
మహిళలపై బూతులు మాట్లాడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు
తన అనుచరులను భయపెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని జగన్ తెలిపారు. ఇలాంటి రాజకీయాలు అవసరమా చంద్రబాబు గారు? అంటూ జగన్ ప్రశ్నించారు.? ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే అభివృద్ధి చూపించాలి, కానీ భయం, బలవంతం చూపడం అవసరమా?” అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. కానీ, ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అది ప్రజలపై దాడిగా మారుతుంది. ఈ విధంగా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, ప్రజల స్వేచ్ఛను అడ్డుకునే రాజకీయాలు ఎంతకాలం సాగుతాయో అన్నది భవిష్యత్తే నిర్ణయించాలని జగన్ తెలిపారు. రోజాపై అంత దారుణమైన మాటలు మాట్లాడతారా అని మండిపడ్డారు. వైసీపీ నేతలపై దారుణంగా దాడులు చేస్తున్నారు, ఇదే మాదిరిగా మా వాళ్లూ దాడులు చేస్తే బాగుంటుందా? అని జగన్ ప్రశ్నించారు. మహిళలపై బూతులు మాట్లాడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు.