Jagan – PM Modi: పార్లమెంట్ స్థానాల డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు కాక మీదున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ కస్సుబుస్సు మంటున్నాయి. స్టాలిన్ చొరవతో చెన్నై వేదికగా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాయి. సౌత్‌లో ఇంత హడావుడి నడుస్తుంటే.. ఏపీలో మాత్రం కూల్ కూల్.
అవును, ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికర రాజకీయ పరిస్థితి. అధికార టీడీపీ, జనసేనలు NDAలో భాగస్వామ్య పక్షాలు. సో, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా నో చెప్పే ఛాన్స్ లేదు. సైలెంట్‌గా ఉండటమో, సపోర్ట్ చేయడమో.. మూడో అప్షన్ లేదు ఆ పార్టీలకు. అందుకే, పార్లమెంట్ స్థానాల డీలిమిటేషన్‌పై టీడీపీ, జనసేనలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. సీఎం చంద్రబాబు మాత్రం తన రాజకీయ అనుభవంతో సరైన సమయంలో సరైన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. ఎక్కడా డీలిమిటేషన్‌పై గట్టిగా మాట్లాడకున్నా.. ఆయన ఇస్తున్న సరికొత్త స్లోగన్ సౌత్ బలాన్ని పెంచడానికే. పెళ్లైన ప్రతీ జంట నలుగురు పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి అంటూ.. తన రాజకీయ చాకచక్యంగా పిలుపునిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైసీపీది మరింత విచిత్ర పరిస్థితి. డీలిమిటేషన్‌పై ఆ పార్టీ ఇప్పటి వరకూ గట్టిగా గొంతెత్తింది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ పోరాటం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ చెన్నై వెళ్లి తన సపోర్ట్ తెలిపారు. మరి, వైసీపీ..? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఇదే ఛాన్స్ అని అపొజిషన్‌లో ఉన్న జగన్ డీలిమిటేషన్‌పై రోడ్డెక్కి ఫైట్ చేయొచ్చుగా? కానీ, ఆ పార్టీ అలాంటి ప్రయత్నాలేమీ చేయట్లేదు. మాకెందుకులే అన్నట్టు ఉంటోంది. వైసీపీ అధినేతకు కేసుల భయం వెంటాడుతోందిన అంటున్నారు. తాను కేంద్రానికి వ్యతిరేకంగా ఏమాత్రం ఎక్స్‌ట్రాలు చేసినా.. పెండింగ్‌లో ఉన్న సీబీఐ, ఈడీ కేసులు మళ్లీ యాక్టివ్ అవుతాయనేది ఆయన టెన్షన్ కావొచ్చు. డీలిమిటేషన్‌తో తనకు పర్సనల్‌గా వచ్చేది లేదు పోయేది లేదని అనుకున్నారో ఏమో.. చైన్నై సౌత్ ఇండియా మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. కాకపోతే.. ప్రధాని మోదీకి ఓ రొటీన్ లెటర్ రాసి తానున్నానంటూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు.
Also Read : తండ్రి పేరు తీసేసినా సైలెంట్.. జగన్ ఎందుకిలా?
ప్రధాని నరేంద్రమోడీకి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. డీలిమిటేషన్ చేయడంలో తప్పు లేదు కానీ.. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను మాత్రం తగ్గించొద్దన్ని లేఖలో కోరారు జగన్. జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయొద్దన్నారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలన్నారు.
గతంలోనూ పీఎం మోదీకి ఇలానే లేఖలు రాసేవారు అప్పటి సీఎం జగన్. వాటిని ప్రేమలేఖలుగా టీడీపీ కొట్టిపడేసేది. వైఎస్సార్‌సీపీ NDAలో భాగస్వామి కాకున్నా.. గత ఐదేళ్లూ కేంద్రానికి ఫుల్ సపోర్ట్‌గానే ఉన్నారు జగన్. పార్లమెంట్‌లో దాదాపు ప్రతీ ఓటింగ్‌లోనూ అనుకూలంగానే వ్యవహరించారు. కేంద్రం అంటే జగన్‌కు టన్నుల్లో భయం అని.. తోక జాడిస్తే.. పాత కేసుల ఉచ్చు బిగుస్తుందని.. అలా అవకాశం వచ్చిన ప్రతీసారి జగన్ తన స్వామి భక్తి చాటుకునే వారని అంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా.. కేంద్రంపై వేలెత్తి చూపించలేని దుస్థితి ఆయనది. సీబీఐ, ఈడీ కేసుల కత్తి ఆయన మెడపై ఎప్పుడూ అలా వేలాడుతూనే ఉంటుంది మరి. అందుకే మోదీకి సరెండర్ అవడం మినహా జగన్‌కు వేరే ఛాన్స్ లేదేమో!