Weight Gain After Marriage: అధిక బరువు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువుతో నానా పాట్లు పడుతున్నారు. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో పాటు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఇదిలా ఉంటే.. సాధారణంగా పెళ్లి తర్వాత బరువు పెరిగే స్త్రీ , పురుషులను మనం చూస్తూనే ఉంటాం. చాలా మంది పెళ్లిళ్ల తర్వాత గతం కంటే ఎక్కువ బరువుతో కనిపిస్తారు. దీనికి గల కారణాలు ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా ? ఓ పరిశోధనలో పెళ్లి తర్వత బరువు పెరగడానికి గల ప్రధాన కారణాలు వెల్లడయ్యాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహం అనేది కొత్త జీవితాన్ని ప్రారంభించే అత్యంత అందమైన అనుభూతి. కానీ పెళ్లి అయిన కొన్ని సంవత్సరాల వివాహం తర్వాత.. చాలా మంది మునుపటి కంటే బరువు పెరుగుతారు. దీనిని సరదాగా ‘హ్యాపీ ఫ్యాట్’ అని కూడా పిలుస్తారు.
వివాహానికి , బరువు పెరగడానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ముఖ్యంగా మగవారు పెళ్లి తర్వాత బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది . పోలాండ్‌లోని వార్సాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన అధ్యయనంలో వివాహం అయిన తర్వాత పురుషులు ఊబకాయం బారిన పడే అవకాశం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది.
పెళ్లి తర్వాత బరువు ఎందుకు పెరుగుతారు ?
ఆహారంలో మార్పులు:
పెళ్లి తర్వాత.. భార్య వండిన వంటలను ఇంట్లో క్రమం తప్పకుండా తినడం ప్రారంభిస్తారు. ఫలితంగా అధిక కేలరీలు , కొవ్వు పదార్థాలు శరీరంలోకి చేరతాయి. దీంతో పాటు.. భార్య భర్తలు ఇద్దరూ కలిసి బయటి ఫుడ్ తినడం జంక్ ఫుడ్ తీసుకోవడం , స్వీట్లు తినడం పెరుగుతుంది. ఇది వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది.
వ్యాయామం లేకపోవడం:
వివాహం తర్వాత.. శారీరక శ్రమపై తక్కువ శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండటానికి జిమ్‌కు వెళ్లేవారు చాలా మందే ఉంటారు. కానీ వివాహం తర్వాత వ్యాయామ సమయం తగ్గుతుంది. అంతే కాకుండా ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
వివాహం తర్వాత.. ఒక వ్యక్తి తన సంబంధం గురించి నమ్మకంగా ఉన్నప్పుడు, ముందులాగా తన లుక్స్ , ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపరు. ఆకర్షణీయంగా కనిపించాలనే ఆందోళన కూడా ఉండదు. “హ్యాపీ ఫ్యాట్” కి ఇది ప్రధాన కారణం అవుతుంది.
హార్మోన్ల మార్పులు, ఒత్తిడి:
వివాహం తర్వాత జీవనశైలిలో మార్పులు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది ఆకలిని పెంచుతుంది. అంతే కాకుండా పని, కుటుంబ బాధ్యతల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా చాలా మంది భావోద్వేగంతో ఎక్కువగా తినడం ప్రారంభిస్తారు.
Also Read: ఈ ఒక్క అలవాటు మార్చుకుంటే చాలు.. క్యాన్సర్ రానే రాదట !
పెళ్లి తర్వాత స్త్రీల కంటే పురుషులు ఎక్కువ బరువు పెరుగుతారా ?
పెళ్లి తర్వాత స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా బరువు పెరుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కారణం వివాహం తర్వాత కూడా స్త్రీలు తమ బరువు , శరీర ఆకృతిపై శ్రద్ధ చూపుతుంటారు. కానీ మగవారు మాత్రం దీనిపై తక్కువ శ్రద్ధ చూపుతుండటమే దీనికి కారణం.
వివాహం తర్వాత.. మొదటి ఐదు సంవత్సరాలలో పురుషుల BMI పెరగడం ప్రారంభమవుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.