
YSRCP latest updates(Andhra news today) :
వైవీ సుబ్బారెడ్డి వైసీపీలో అత్యంత కీలక నేత. సీఎం జగన్ కు బంధువైన ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ తీసుకునే ముఖ్య నిర్ణయాల్లోనూ వైవీ పాత్ర ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అందుకే ఆయన ఆశీస్సుల కోసం కొందరు నేతలు మోకరిల్లుతున్నారు.
2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచి వైవీ సుబ్బారెడ్డి .. 2019 మాత్రం పోటీ చేయలేదు. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డికోసం తన సీటును త్యాగం చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో టీటీడీ ఛైర్మన్ పదవిని వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు సీఎం జగన్. ఆ తర్వాత రెండోసారి ఆ పదవిలో కొనసాగించారు. తాజాగా వైసీపీలో మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో నేతలు వైవీ సుబ్బారెడ్డి ఆశీస్సులు కోసం తపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఓ వివాదం చుట్టుకుంది.
వైవీ సుబ్బారెడ్డిపై టీడీపీ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఏపీలో పాలిటిక్స్ లో హీట్ పుట్టించింది. ఆ ఫోటోలో వైవీ సుబ్బారెడ్డి కుర్చీలో కాలుపై కాలు వేసుకుని కూర్చున్నారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా చేసిన దివంగత కాంగ్రెస్ నేత కోనేరు రంగారావు మనువరాలు సత్యప్రియ ఆయన పక్కన మెట్లపై కూర్చున్నారు. దళితురాలు కాబట్టే ఆమెను కింద కూర్చోబెట్టారని అంటూ టీడీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. పెత్తందార్ల ముందు దళితులు కుర్చీలో కూర్చోకూడదా? అని ప్రశ్నించింది. దళితులకు వైసీపీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీసింది. వైవీ సుబ్బారెడ్డికి ఇంత అహంకారమా? అంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. గతేడాది ఏప్రిల్ 29న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. వైవీ సుబ్బారెడ్డికి సాష్టాంగ నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. ఆయన ముందు మంత్రి మోకరిల్లి నమస్కరించారు. 2022 ఏప్రిల్ 29న కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరంలో మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో ఈ ఘటన జరిగింది. కుడిపూడి చిట్టబ్బాయి కుటుంబానికి ఆర్థికసాయం అందించిన వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ కు ఎన్ని జన్మలైనా శెట్టిబలిజలు శిరస్సు వంచి నమస్కరిస్తారంటూ వేణు.. వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించారు. అప్పట్లో మంత్రి వేణు చర్యపై వివాదం రేగింది. శెట్టిబలిజ సామాజికవర్గంలోని కొందరు నేతలు మంత్రి తీరుపై మండిపడ్డారు.
KA Paul : ఎన్నికల కమిషన్‌పై మండిపడిన కేఏ పాల్