
Telangana congress party news(Political news today telangana) :
తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టిక్కెట్ల వ్యవహారం కాక రేపుతోంది. రాష్ట్రంలో పార్టీ బలం బలం రోజురోజు పెరుగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్లు హాట్ కేకుల్లా మారాయి. ఒక్కో సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొంది. ఆయా నేతలు తమ బలాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వివాదాలు రేగుతున్నాయి.
తాజాగా గాంధీభవన్‌లో పోస్టర్లు కలకలం రేపాయి. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ టికెట్ మధుయాష్కీకి ఇవ్వద్దని అందులో పేర్కొన్నారు. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్.. గో బ్యాక్ టు నిజామాబాద్ , పారాచూట్ నాయకులకు టిక్కెట్లు ఇవ్వొద్దంటూ అంటూ పోస్టర్లపై స్లోగన్స్ ఉన్నాయి. ఈ పోస్టర్స్‌పై టీపీసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోస్టర్లను గాంధీభవన్ సిబ్బంది తొలగించారు.
మధు యాష్కీ గతంలో రెండుసార్లు నిజామాబాద్ నుంచి ఎంపీ గెలిచారు. అక్కడ నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఆయనపై గెలిచారు. 2018లో ఆయన మూడో స్థానానికి పడిపోయారు. అక్కడ కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు ఓడిన మధుయాష్కీ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తూ మధుయాష్కీ దరఖాస్తు చేశారు. అయితే ఆ స్థానాన్ని ఆశిస్తున్న నేతలు మధుయాష్కీపై గుర్రుగా ఉన్నారు. ఈక్రమంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టుర్లు ఏర్పాటయ్యాయి.