Big Stories

YCP Resignations | పవన్, లోకేష్‌లపై జగన్ గురి.. బిఆర్ఎస్ పరిస్థితి చూసి వైసీపీ అలర్ట్!

Share this post with your friends

AP Politics

YCP Resignations news(AP politics):

లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని.. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇటీవలే తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెమటలు పడుతున్న పరిస్థితి. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలనే నమ్ముకుని ఎన్నికల బరిలో దిగింది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేల వలనే బిఆర్ఎస్ కొంప మునిగింది.

బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలలో ఉన్న అసంతృప్తి కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చింది. ఇది చూసి ఏపీలో జగన్ పార్టీ ఒక్కసారిగా షాకైంది. ప్రజలు ముఖ్యమంత్రిని మాత్రమే చూసి ఓటేస్తారని అనుకోవడం మూర్ఖత్వమని తెలంగాణ ఎన్నికల ఫలితాలతో అర్థమవుతోంది. ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వైసిపి అధ్యక్షుడు జగన్.. రాబోయే ఎన్నికల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుని పరిశీలిస్తున్నారు. కేవలం గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి, గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అందుకే పార్టీలో వరుస రాజినామాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాకలో పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి రాజీనామాలు చేయడంతో వైసిపీలో కలకలం రేగింది. ఈ రెండు నియోజకవర్గాలు వైసీపీ కీలకం. ఎందుకంటే 2019లో మంగళగిరి నుంచి అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. కానీ వైసీపీ సీనియర్ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి నారా లోకేశ్‌ని ఓడించారు. మరోవైపు గాజువాకలో తిప్పల నాగిరెడ్డి ..పవన్ కళ్యాణ్‌ని మట్టికరిపించారు. తిప్పల నాగిరెడ్డి కుమారుడే తిప్పల దేవన్ రెడ్డి. నాగిరెడ్డి ఎమ్యెల్యేగా ఉన్నా గాజువాకలో వ్యవహారలన్నీ ఆయన కుమారుడు దేవన్ రెడ్డి అన్నీ తానై చూసుకుంటాడు.

కానీ ప్రస్తుతం వైసీపీ.. మంగళగిరిలో మరో నాయకుడు గంజి చిరంజీవికి ఈసారి టికెట్ ఇవ్వాలని యోచిస్తోంది. గంజి చిరంజీవి ఒక బిసీ అభ్యర్థి. ఆయనకు స్థానికంగా పట్టు కూడా ఉంది. ఇటీవలే చిరంజీవి పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. పైగా 2014లో గంజి చిరంజీవి తెలుగుదేశం అభ్యర్థిగా మంగళగిరి నుంచి పోటీ చేసి కేవలం 12 ఓట్లతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ తరువాత గంజి చిరంజీవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఈసారి కూడా టిడిపి తరపున నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీచేయబోతున్నట్లు తెలిసింది. అందుకే ఈ సారి వైసీపీ తరపున మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల బరిలో గంజి చిరంజీవికి టికెట్ ఖాయమని సమాచారం.

మరోవైపు గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడిని భారీ మెజారిటీతో ఓడించిన పెద్ద నాయకుడు తిప్పల నాగిరెడ్డి. ఇప్పుడు ఆయన కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఈసారి తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా మరో యాదవ సామాజికవర్గానికి వైసీపీ టికెట్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తిప్పల దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి వైసీపీని తమ భుజాలపై మోసిన వారు. వీరిద్దరూ రాజీనామా చేయడంతో పాటు వారి అనుచరులంతా వైసీపీ కార్యకర్తలుగా రాజీనామా చేశారు. ఇది వైసీపీకి ఎన్నికల ముందు శుభపరిణామం కాదు. మరోవైపు వైసీపీ అసంతృప్తుల జాబితాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముందంజలో ఉన్నారు. వైసీపీకి రాజీనామాలు చేసిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వంటి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా చేరిపోయారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్ప మిగతా నలుగురువెరూ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు.

ఏపీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తిలాగే, తెలంగాణలో ఖమ్మం జిల్లా నాయకులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పంతాన చేరారు. వీరిద్దరూ ఖమ్మంలో విజయం సాధించి కేసీఆర్ అహంకార ధోరణికి చరమగీతం పాడారు. ఇప్పుడు వైసీపీ ఏ ప్రాతిపదికన ఎన్నికలకు వెళుతుందో చూడాలి.

వైసీపీ అగ్రనాయకులు తెలంగాణలో బిఆర్ఎస్ తప్పులను రిపీట్ చేస్తారా లేక కొత్తవారికి అవకాశమిచ్చి ఎన్నికలకు వెళతారా.. అనేది తేలాల్సి ఉంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News