Shyamala On Pawan Kalyan: జనసేన పార్టీని వైసీపీ టార్గెట్ చేసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మీడియా సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి శ్యామల సీరియస్ కామెంట్స్ చేయడం విశేషం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి శ్యామల మీడియా సమావేశం నిర్వహించారు. శ్యామల మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నాటి సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దిశా యాప్ ను ప్రవేశపెట్టి మహిళలకు పూర్తి రక్షణ కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, మహిళా అభ్యుదయాన్ని కూటమి ఎప్పుడు మర్చిపోయిందన్నారు.
పవన్ టార్గెట్ గా విమర్శలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ శ్యామల సీరియస్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో శ్యామల ప్రదర్శించారు. నాడు పవన్ తెగ ఊగుతూ మాట్లాడారని, ఇప్పుడు మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని గ్రహించి పవన్ మళ్లీ ఊగుతూ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల రక్షణ తన బాధ్యతగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని స్వయానా పవన్ కళ్యాణ్ చెప్పారని, మహిళా రక్షణకు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలను విధానాలను ప్రవేశపెట్టిందో చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ పౌరుషం చచ్చిపోయిందా అంటూ శ్యామల కామెంట్స్ చేయడం విశేషం.
సుగాలి ప్రీతి కేసు ఏమైంది?
సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ ప్రకటించారని, ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అంటూ శ్యామల ప్రశ్నించారు. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసును ఛేదిస్తామని గొప్పలు చెప్పారని, ఇప్పుడు ఆ కేసు ఏమైందంటూ శ్యామల ప్రశ్నించారు. ఉచిత బస్సు గురించి సీఎం చంద్రబాబు హామీలు గుప్పించి, ఇప్పుడు కేవలం జిల్లాల వరకే ఉచిత బస్సు అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమంజసమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాల పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యాయని, సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని ఆమె విమర్శించారు. సీఎం చంద్రబాబు మాటలకు క్రెడిబులిటీ లేదని, మహిళా అభ్యుదయం సాధికారత అంటూ గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఏమయ్యారని ఆమె ప్రశ్నించారు.
Also Read: AP Cabinet: కాకినాడ దశ తిరుగుతోందా? ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం..
అయితే ఇటీవల జనసేన లక్ష్యంగా వైసీపీ విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. మొన్న దువ్వాడ శ్రీనివాస్, నిన్న మాజీ సీఎం జగన్, అంబటి రాంబాబు, నేడు శ్యామల వరుసగా పవన్ ను టార్గెట్ చేయడంతో జనసేన కూడా స్ట్రాంగ్ రిప్లై ఇస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు వైసీపీ మాటలు కోటలు దాటుతున్నాయని జనసేన క్యాడర్ విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని జనసేన సోషల్ మీడియా అంటోంది.