Shyamala on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్ అయ్యారు. ఇటీవల కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న శ్యామల.. రావడం రావడమే పవన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. ఇటీవల తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ లక్ష్యంగా శ్యామల ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ.. నేరుగా తన విమర్శల పదును పవన్ వైపు మళ్లించారు. అధికారంలోకి రాకముందు పవన్ ఎన్నో మాటలు చెప్పారని, ఇప్పుడు సైలెంట్ అయ్యారని శ్యామల విమర్శించారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో శ్యామల మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయంలో మహిళలకు రక్షణ ఉండేదన్నారు. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం ఉందన్నారు. ఇక తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ గురించి శ్యామల మాట్లాడుతూ.. కిరణ్ రాయల్ ను నమ్మి ఓ మహిళ మోసపోయిందని, అయినా కూడ అతనికే జనసేన వత్తాసు పలుకుతుందని విమర్శించారు. డబ్బులు తీసుకొని నమ్మించి మోసం చేసిన కిరణ్ ఇంటి వద్ద ఉంటే, మోసపోయిన లక్ష్మి మాత్రం జైలుకు వెళ్ళిందన్నారు. ఏపీలో మహిళలు భయం గుప్పిట్లో ఉన్నారని, లక్ష్మీకి కూటమి తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో మహిళలకు అన్యాయం జరిగితే సహించబోమని రాగాలు తీసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. పక్క ప్లాన్ ప్రకారం కిరణ్ రాయల్ వ్యవహరించి, లక్ష్మికి మోసం చేశారన్నారు. జనసేన సిద్ధాంతాల ప్రకారం మహిళలకు అండగా ఉంటామన్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం లక్ష్మికి జరిగిన అన్యాయంపై ఏం చెప్తారంటూ శ్యామల ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు, మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను నేతలు మర్చిపోయారన్నారు.
Also Read: Hyderabad Weather: హైదరాబాద్ కు ముందే వచ్చిన వేసవి.. 5 రోజులు భగభగలు..
లక్ష్మీ చేస్తున్న ఆరోపణలకు కిరణ్ రాయల్ సమాధానం చెప్పలేక, ఏకంగా జైపూర్ పోలీసులను తిరుపతికి రప్పించారన్నారు. లక్ష్మీని జైలుకు పంపిస్తానని ముందే కిరణ్ రాయల్ ఎలా చెప్పారంటూ.. శ్యామల ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం జైపూర్ పోలీసులకు సమాచారమిచ్చి, లక్ష్మిని అరెస్టు చేయించారన్నారు. తనకు జరిగిన అన్యాయంపై లక్ష్మి ప్రశ్నించినందుకే, కటకటాల వెనక్కు పంపి ఆమె గొంతును నొక్కి వేశారన్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ ధాటికి ఓ మహిళ కన్నీటి పర్యంతమవుతున్నా.. కేవలం పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్ ను తాత్కాలికంగా దూరం చేసి జనసేన చేతులు దులుపుకుందని ఆమె విమర్శించారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలని, కిరణ్ రాయల్ పై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది కూడా తేల్చాలని శ్యామల డిమాండ్ చేశారు.