రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న జగన్, దానికి ప్రతిగా ఓ యాప్ తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాప్ ద్వారా తాము ప్రతీకారం తీర్చుకుంటామని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఒక్కర్నీ వదిలిపెట్టబోమని, అందరి సంగతి తేలుస్తామన్నారు. అందరికీ సినిమా చూపిస్తాంమంటూ సినిమా డైలాగులు కొట్టారు జగన్.
రెడ్ యాప్..
రాష్ట్రంలో అన్యాయానికి, వేధింపులకి గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకురాబోతున్నామని ప్రకటించారు మాజీ సీఎం జగన్. అతి త్వరలో ఈ యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందులో మూడు ఆప్షన్లు ఉంటాయని వివరించారు.
1. బాధితుల వివరాలు
2. ఇబ్బంది పెట్టిన అధికారి పేరు, వివరాలు
3. ఆధారాలు
బాధితులెవరైనా తమ వివరాలు నమోదు చేసి ఫిర్యాదు చేయాలన్నారు జగన్. తమని ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు అందులో సూచించాలన్నారు. అధికారి పేరుని కూడా ఆ యాప్ లో అప్ లోడ్ చేయాలని, ఆధారాలుంటే ఆ డాక్యుమెంట్లను కూడా జత చేయాలని సూచించారు. ఆ మూడు వివరాలు అప్ లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. అలా సబ్మిట్ కొడితే ఆ పిర్యాదు వైసీపీ డిజిటల్ లైబ్రరీలోకి చేరుతుంది. ఈ ఫిర్యాదులకోసమే వైసీపీ డిటిజల్ లైబ్రరీని మెయింటెన్ చేస్తామని తెలిపారు జగన్. తమ ఇబ్బందులకు పరోక్ష కారణమైన టీడీపీ నాయకుల పేర్లు కూడా అందులో ప్రస్తావించాలని సూచించారు.
రాష్ట్రంలో అన్యాయానికి, వేధింపులకి గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకురాబోతున్నాం
అందులో అధికారి పేరుతో ఫిర్యాదు చేయవచ్చు. ఆధారాలు ఏవైనా ఉంటే అక్కడే అప్లోడ్ జత చేయవచ్చు
ఒక్కసారి సబ్మిట్ కొడితే.. వైయస్ఆర్సీపీ డిజిటల్ లైబ్రరీలోకి ఆ ఫిర్యాదు వచ్చేస్తుంది… pic.twitter.com/6g67R1GjCB
— YSR Congress Party (@YSRCParty) July 29, 2025
ఆ తర్వాత ఏం చేస్తారు?
ఒక్కసారి వైసీపీ డిజిటల్ లైబ్రరీలోకి ఆ ఫిర్యాదు వెళ్తే ఇక మాడిఫికేషన్లు ఉండవు. ఫిర్యాదు చేసిన వారి వివరాలతోపాటు, ఎవరిపై చేశారు, అసలు వారిని ఇబ్బంది పెట్టడానికి పరోక్ష కారణం ఎవరు వంటి వివరాలన్నీ లైబ్రరీకి వెళ్తాయి. ఈ లైబ్రరీని అప్పుడే ఓపెన్ చేయరు. 2029 ఎన్నికల తర్వాత దానిని వినియోగం లోకి తెస్తారు. అప్పుడు వైసీపీయే అధికారంలోకి వస్తుందని, తాను సీఎం అయ్యాక, ఆ డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేసి అందరి సంగతి తేలుస్తానని చెప్పారు జగన్. ఎవరెవరు తప్పు చేశారో, ఎవరెవరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో.. అందర్నీ చట్టం ముందు నిలబెడతామని, ఏం చేయాలో అది చేస్తామని అన్నారు.
సినిమా చూపిస్తా..
తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అంటున్నారు జగన్. ఇప్పుడు చంద్రబాబు ఏదైతో విత్తారో అదే రేపు పండుతుందని, ఆ ఫలాలు అనుభవించక తప్పదని హెచ్చరించారు. మనమేమీ కావాలని అన్యాయం చేయబోమని టీడీపీ వాళ్లు చేసేదానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు జగన్. ఈ యాప్ లాంచింగ్ డేట్ చెప్పలేదు కానీ, త్వరలో అని మాత్రం ప్రకటించారు. టీడీపీ రెడ్ బుక్ మెయింటెన్ చేసినట్టుగానే, వైసీపీ ఈ రెడ్ యాప్ లో అన్నీ నోట్ చేసుకుంటుందని అనుకోవాల్సిందే. అయితే అధికారంలోకి వచ్చాకే ఈ రెడ్ బుక్ యాప్ లోని సమాచారాన్ని డిజిటల్ లైబ్రరీనుంచి బయటకు తీసుకొస్తానంటున్నారు జగన్. అంటే అప్పటి వరకు వైసీపీ వాళ్లు ఫిర్యాదులు చేసి వేచి చూస్తూ ఉండాలనమాట.